Khammam ACP clarity on illegal cases: పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఖమ్మంలో కొంతమంది నేతలు ప్రయత్నిస్తున్నారని ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. అక్రమ కేసులు పెట్టారనటంలో వాస్తవం లేదని.. భాజపా కార్యకర్తలపై అక్రమ కేసులంటూ వస్తున్న ఆరోపణలనుద్దేశించి స్పష్టతనిచ్చారు. తీవ్ర నేరాలు ఉన్నవారిపై కచ్చితంగా రౌడీషీట్ తెరుస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ.. పలు వివరాలు వెల్లడించారు.
అసత్య ఆరోపణలతో పక్కదారి పట్టిస్తున్నారని... వారిపై 20 సంవత్సరాల క్రితమే కేసులు ఉన్నాయని ఏసీపీ ఆంజనేయులు తెలిపారు. రెండ్రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన భాజపా కార్యకర్త సాయి గణేశ్‌పై కేవలం ఆరు కేసులు ఉన్నాయని.. అతనిపై 2020లో రౌడీషీట్ తెరిచామని చెప్పారు. సాయి గణేశ్ ఆత్మహత్య ఘటనకు సంబంధించి దర్యాప్తు జరుగుతోందన్న ఏసీపీ... త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని వెల్లడించారు.
'అక్రమ కేసులు పెట్టారని పోలీసులపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారు. మహమ్మద్ ముస్తఫా అనే వ్యక్తిపై 2000 లోనే మాదకద్రవ్యాల సరఫరాలో కేసు నమోదై ఉంది. మృతుడు సాయిగణేశ్‌పై 6 కేసులున్నాయి. వాస్తవాలను దాచి మాపై కావాలనే ఆరోపణలు నెడుతున్నారు. పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు.' -ఆంజనేయులు, ఖమ్మం ఏసీపీ