కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవేన పంచాయతీ పరిధిలోని కుర్సిగూడెం కొలాం ఆదివాసులకు పోలీసులు సైకిళ్లు అందజేశారు. పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్కు చెందిన రాబిన్హుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఏఎస్పీ వైవీ సుధీంద్ర చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. అత్యంత ఎత్తులో గుట్టపై ఉండి సరైన రహదారి సౌకర్యం లేని గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏఎస్పీ తెలిపారు.
ఇటీవలే సోలార్ విద్యుత్ వెలుగులు
ఇటీవలే విద్యుత్ సౌకర్యం కోసం సోలార్ విద్యుత్ దీపాలు అందించామని ఆసిఫాబాద్ ఏఎస్పీ వైవీ సుధీంద్ర తెలిపారు. చుట్టుపక్కల వారికి ఏ అవసరం ఉన్నా వెళ్లేందుకు వీలుగా 5 సైకిళ్లు అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనారోగ్య సమస్యలు, అత్యవసర పనుల కోసం వెళ్లేందుకు సైకిళ్లు అందించాలని తిర్యాణి ఎస్సై రామారావు ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు.
పోలీసుల ప్రత్యేక దృష్టి
కుర్సిగూడెం గ్రామముపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని... ఆత్యవసరాల కోసం ఈ సైకిళ్లను గ్రామస్తులందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. గ్రామస్తులు అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ ఆచ్చేశ్వర్ రావు, రెబ్బెన సీఐ సతీశ్ కుమార్, తిర్యాణి ఎస్సై రామారావు, రాబిన్ హుడ్ ఆర్మీ ప్రతినిధులు రాం కుమార్, దామోదర్, కుర్సిగూడెం పటేల్ టేకం జైతు పాల్గొన్నారు.