Drunken mob attack dhabha in khammam : మద్యం మత్తులో రోడ్లపై గుంపులుగా తిష్టవేస్తారు. వాళ్లలో వాళ్లే గొడవపడుతూ రసాభాస సృష్టిస్తారు. ఆకతాయితనంతో రోడ్డున పోయే వాళ్లను దూషిస్తారు. దుర్భాషలాడుతున్న వారిని.. ఇదేంటని ప్రశ్నిస్తే మారణాయుధాలతో దాడులకు తెగబడతారు.ఖమ్మం నగరం గోపాలపురంలో మద్యం, గంజాయి మత్తులో యువకులు హల్ చల్ చేశారు.
స్థానిక కిరాణా దుకాణాలపై.. పక్క షాప్ యువకులే దాడి చేశారు. మహిళలు, పిల్లలను విచక్షణ రహితంగా కొట్టారని బాధితులు తెలిపారు. శనివారం రాత్రి చిన్న గొడవ జరిగింది. అదిమనసులో పెట్టుకొని ఒక్కసారిగా దాడి చేయడంతో.. కవిత అనే మహిళకు, ఆమె పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గంజాయి మత్తులో దాడి చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాడిలో కవిత తీవ్రగాయాలతో పడిపోగా.. ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఘటనను చిత్రీకరిస్తున్న విలేకరిపై దాడికి దిగారు. మొబైల్ ఫోన్ లాక్కొని పగులగొట్టారు. ఈ ఘటనపై ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇకనైనా ఖమ్మంలో ఇలాంటి ఆగడాలు అరికట్టే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గోపాలపురంలో వీరంగం సృషించిన యువకులు.. రఘునాథపాలెంలోని ఓ దాబాలోనూ హంగామా చేశారు. దాబాలో కొంతమందితో ఘర్షణకు దిగారు.
అడ్డొచ్చిన వారిపైనా దాడికి తెగబడ్డారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపైనా విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో.. అక్కడకు చేరుకున్న పోలీసులు పలువురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.