తెలంగాణ

telangana

ETV Bharat / state

TRS protests: ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు.: కేంద్రంతో పోరులో తెరాస నేతలు - telangana news

TRS protests for Paddy Procurement: ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగతూ.. తెరాస పోరాటాలు మొదలుపెట్టింది. ఐదంచెల పోరులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో గులాబీ శ్రేణులు నిరసన దీక్షలకు దిగాయి. వడ్ల కొనుగోలులో కేంద్రవైఖరి మార్చుకునేంత వరకు వివిధరూపాల్లో కొట్లాడతామని మంత్రులు స్పష్టం చేశారు.

Rythu Deeksha by TRS
రాష్ట్ర వ్యాప్తంగా తెరాస 'రైతు దీక్ష

By

Published : Apr 4, 2022, 12:34 PM IST

Updated : Apr 4, 2022, 3:45 PM IST

ధాన్యం కొనేవరకు పోరాటం ఆగదు.: కేంద్రంతో పోరులో తెరాస నేతలు

TRS protests for Paddy Procurement: కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో తెరాస నేతలు రోడ్డెక్కారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు దీక్షలో భాగంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ధర్నాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రైతుల నుంచి ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్​ చేశారు.

రైతులకు ముందే చెప్పాం:రైతుల ఆగ్రహాన్ని దిల్లీ పాలకులకు చూపిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. రాష్ట్రాల నుంచి బియ్యం కాకుండా ధాన్యాన్నే సేకరించాలని.. తెలంగాణలో కేంద్రప్రభుత్వం నేరుగా వడ్లు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. మహబూబ్​నగర్​ జిల్లా మూసాపేటలో తెరాస నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ధర్నాలో మంత్రి నిరంజన్​ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్​ రెడ్డి పాల్గొన్నారు. యాసంగిలో వరి సాగు చేయొద్దని రైతులకు ముందే చెప్పామని.. రాష్ట్ర భాజపా నేతలు రైతులను రెచ్చగొట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూసాపేటలో నిరసన దీక్షలో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి

"వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఎదిగింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం వినిపించుకోవట్లేదు. ధాన్యాన్ని మేము కొనిపిస్తామని భాజపా నేతలు అన్నారు. ధాన్యాన్ని కొనిపిస్తామన్న భాజపా నేతలు ఇవాళ కనిపించట్లేదు. తెలంగాణలో ధాన్యం కొనాలని కేంద్రాన్ని అడగట్లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే నూకలు ఎక్కువగా వస్తాయి. తెలంగాణలో కేంద్రప్రభుత్వం నేరుగా వడ్లు తీసుకోవాలి."

-నిరంజన్​ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

నిజామాబాద్​ జిల్లాలో: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌లో నిర్వహించిన నిరసన దీక్షలో రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. పంజాబ్ తరహాలో రాష్ట్ర రైతులు పండించిన వరిని కేంద్రం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. మోదీ సర్కార్‌ దిగొచ్చేవరకు దశలవారీగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రానికి రాష్ట్రం సబ్సిడీ ఇవ్వాలని భాజపా ఎంపీలు అనటం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తామని స్పష్టం చేశారు.

వేల్పూర్​లో రైతు దీక్షలో మంత్రి ప్రశాంత్​ రెడ్డి

"రైతుల కోసం గల్లీ నుంచి దిల్లీ దాకా పోరాటం చేస్తాం. పంజాబ్ తరహాలో తెలంగాణలోనూ ధాన్యం కొనాలి. కేంద్రమంత్రి పీయూష్ తెలంగాణ ప్రజలను అవమానించారు. ప్రజలకు నూకలు తినే అలవాటు చేయించాలన్నారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తాం. కేంద్రానికి రాష్ట్రం సబ్సిడీ ఇవ్వాలని భాజపా ఎంపీలు అనటం సిగ్గు చేటు."

-ప్రశాంత్​ రెడ్డి, రాష్ట్ర మంత్రి

మహేశ్వరంలో: కేంద్రం వైఖరి తెలిసి వరి వద్దని సీఎం కేసీఆర్​ ముందే చెప్పారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తెరాస నేతలు చేపట్టిన నిరసన దీక్షలో మంత్రి సబిత పాల్గొన్నారు. వరి వేయాలని రైతులను భాజపా నేతలు రెచ్చగొట్టారని.. వరి కొనిపిస్తామన్న భాజపా నేతలు ఇప్పుడు కనిపించట్లేదని ఎద్దేవా చేశారు. కేంద్రమే నేరుగా ధాన్యాన్ని కొనాలని.. మోదీ ప్రభుత్వం వరి కొనేంత వరకు విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

మహేశ్వరంలో నిరసన దీక్షలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

"కేంద్రం వైఖరి తెలిసి.. వరి వద్దని సీఎం ముందే చెప్పారు. కానీ వరి వేయాలని రైతులను భాజపా నేతలు రెచ్చగొట్టారు. వరి కొనిపిస్తామన్న భాజపా నేతలు ఇప్పుడు కనిపించట్లేదు. మోదీ ప్రభుత్వం కొనేంత వరకు విడిచిపెట్టేది లేదు."

-సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర మంత్రి

వరంగల్​ జిల్లాలో: రైతులు పండించిన వరి ధాన్యం కోనేంత వరకు పోరాటాలు ఆగవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పునరుద్ఘాటించారు. తెలంగాణ రైతుల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న విధానాలకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. రాయపర్తి మండల కేంద్రం వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై వందలాది మంది రైతులతో కలసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం.. రైతు వ్యతిరేక విధానాలు వీడి అన్నదాతల సంక్షేమం కోసం కృషి చేయాలని మంత్రి హితవు పలికారు. ఈ నిరసనలో ఎడ్ల బండ్ల ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వరంగల్​- ఖమ్మం జాతీయ రహదారిపై ఎడ్ల బండ్ల ర్యాలీలో మంత్రి ఎర్రబెల్లి

ధర్మసాగర్‌లో...

రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరని నిరసిస్తూ హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో తెరాస శ్రేణులు నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టారు. కేంద్రం రైతులపై మొసలి కన్నీరు కారుస్తుందని ఆయన మండిపడ్డారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోతే రైతులంతా ఏకం కావాలని ఆయన సూచించారు. రైతుల సంక్షేమం కోసం తెరాస అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తుందన్నారు. కేంద్రం వరి ధాన్యాన్ని కోనుగోలు చేసేంతవరకు ఆందోళనలు ఆపేది లేదన్నారు.

ఖమ్మం జిల్లాలో:మంత్రికేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు దీక్షలో భాగంగా ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం మంచుకొండలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వైరా నియోజకవర్గంలో తెరాస శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. వైరా, ఏనుకూరు, కొనిజర్ల, జూలూరుపాడు, కారేపల్లి మండలాల్లో నాయకులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దీక్షలో కూర్చున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నియంతృత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.

మంచుకొండలో తెరాస శ్రేణులతో మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​

కరీంనగర్​లో: కరీంనగర్ మండలం గోపాల్ పూర్ వద్ద రైతుల నిరసన, ధర్నాలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కేంద్రం ధాన్యం కొనేంతవరకు రైతులు, పార్టీలకు అతీతంగా అందరూ నిరసనలు చేయాలని సూచించారు.

గోపాలపూర్​లో రైతు దీక్షలో మంత్రి గంగుల కమలాకర్​

సూర్యాపేటలో: రాష్ట్రంలో ప్రతి గింజా కొనేవరకు ఉద్యమం ఆగదని మంత్రి జగదీశ్​ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర విధానాలు రైతులకు నష్టం చేసేలా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం తరహాలో మరోసారి భారీ ఉద్యమం ఖాయమన్నారు. సూర్యాపేటలో తెరాస నిరసన దీక్షలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మంత్రి డిమాండ్​ చేశారు. పంజాబ్‌ తరహాలో నేరుగా ధాన్యమే సేకరించాలని.. ధాన్యం కొనే వరకు రైతులతో కలిసి పోరాడుతామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:పీయూష్‌ గోయల్‌పై ప్రివిలేజ్​ నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు

Last Updated : Apr 4, 2022, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details