ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా తెరాస నేతలు సభా వేదికపై ఆసీనలవుతున్నారు. మంత్రులు, ఉన్నతాధికారుల పక్కన కూర్చుంటూ.. డాబు ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో నిబంధనలు పాటించాలన్న కనీస మర్యాద కూడా పాటించడం లేదు.
ప్రోటోకాల్ మరిచి వేదికపై ఆసీనులైన తెరాస నేత!
ప్రభుత్వ కార్యక్రమం జరిగినప్పుడు అధికార గణం తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాల్సిందే. ఒకవేళ ఏదైనా కార్యక్రమంలో ప్రోటాకాల్ పాటించకపోతే.. అక్కడ జరిగే రభస అంతా ఇంతా కాదు. అచ్చం అలాంటిదే ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. మంత్రులు, ఉన్నతాధికారులు ఉన్న వేదికపై తెరాస నేత దర్జాగా కూర్చుని ప్రోటోకాల్ పాటించకుండా ప్రజా ప్రతినిధులతో ముచ్చట్లు పెట్టారు.
జిల్లాలోని వైరా మండలం తాటిపూడిలో ఆరో విడత హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు.. ఎమ్మెల్యే రాములు నాయక్, జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, ఉన్నతాధికారులు, కలెక్టర్, ఇతర అధికారులు హాజరయ్యారు. వీరితో పాటు.. ఆ కార్యక్రమానికి వచ్చిన తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాతా మధు సభా వేదికపై దర్జాగా కూర్చున్నారు. అమాత్యులు, కలెక్టర్, ఉన్నతాధికారులు ఉన్న వేదికపైకి రాజకీయ పార్టీల నేతలను అనుమతించడం సరికాదు. ఈ విషయమై.. అక్కడున్న సభలో ఉన్నవారంతా సభా వేదికపై తెరాస నేత కూర్చుని.. సరదాగా ప్రజా ప్రతినిధులతో ముచ్చటించడం గురించి చర్చించుకున్నారు.
ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం