ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేయడమే లక్ష్యంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన... కమలదళంలో నూతనోత్సాహాన్ని నింపింది. రోజంతా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, ముఖ్య నేతలు పర్యటించారు. వరంగల్ క్రాస్ రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు భాజపా శ్రేణులు రాష్ట్ర అగ్రనేతలకు భారీ ప్రదర్శనతో స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ నేతలు ముందుకు కదిలారు. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు చేశారు.
ఖమ్మంలో కమలం అగ్రనేతల పర్యటన.. శ్రేణుల్లో కొత్త జోష్
ఖమ్మం కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేసేందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తంచేశారు. రాబోయే కార్పొరేషన్ పోరులో కమల వికాసం ఖాయమన్న ఆయన ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. నగరపాలక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అగ్రనేతల పర్యటన... భాజపాలో కొత్త జోష్ నింపుతోంది. నేడు వరంగల్ కార్పొరేషన్‌లో బండి సంజయ్‌తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ పర్యటించనున్నారు.
బల్దియా ఎన్నికలపై పార్టీ శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేశారు. తొలుత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులతో సమావేశమయ్యారు. పార్టీ పోలింగ్ బూత్ కమిటీలతో నిర్వహించిన సమావేశంలో బండి సంజయ్, తరుణ్ చుగ్ పాల్గొని ఎన్నికల సన్నద్ధతపై పలు సూచనలు చేశారు. పార్టీ గెలవాలంటే బూత్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. ఖమ్మంలో ప్రజా స్పందన బాగుందని..ప్రజలు మార్పు కోరుకుంటున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఖమ్మం కార్పొరేషన్‌కు భాజపా నాయకులు వస్తున్నారంటేనే..తెరాస నేతలు వణికిపోతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కు చెందిన ఎడ్యుకేషనల్ ట్రస్టుపైనా విచారణ జరిపిస్తామన్నారు.
నేడు వరంగల్ పర్యటన..
గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఇవాళ వరంగల్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలసి ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ పర్యటించనున్నారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలోనూ పాల్గొననున్నారు.