Cotton Record Price: రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ధాన్యం కొనుగోళ్లు దయనీయ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో.. పత్తి రైతులకు కాస్త ఊరట కలుగుతోంది. పత్తి ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి రికార్డు ధర పలికింది. ఈ సీజన్లోనే గరిష్ఠంగా క్వింటాల్ పత్తి రూ.9 వేలు పలికింది. నిన్న మార్కెట్లో రూ.8,900 పలికిన తెల్ల బంగారం.. నేడు రూ.100 పెరిగి రైతులకు ఉపశమనం కలిగించింది. నాణ్యత బాగా ఉన్న పత్తికి వ్యాపారులు రూ.9000 చెల్లించగా.. పత్తి నాణ్యతను బట్టి 8 వేల వరకు చెల్లించారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లోనూ పత్తి ధరలు పైపైకి చేరాయి. గరిష్ఠంగా క్వింటా పత్తి రూ.8,800 పలికింది.
ధర పెరిగినా లాభం తక్కువ
పత్తికి మంచి ధర రావడం పట్ల రైతులు ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తున్నా.. మరో వైపు ఆశించిన స్థాయిలో దిగుబడి లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో పంట నీట మునగడంతో పాటు పెట్టుబడి ఖర్చులు పెరగడంతో ధర పెరిగినా అంతగా గిట్టుబాటు కాదని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరగటం.. దేశీయంగా దిగుబడి కూడా తగ్గడంతో పత్తికి అత్యధిక ధర పలుకుతోందని ఖమ్మం మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేశ్ తెలిపారు.