Puvvada Ajay Clarity on Contesting from Kukatpally : తాను ఖమ్మంలోనే ఉంటానని.. ఖమ్మం ప్రజలను వదిలి వెళ్లేదే లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తాను కూకట్‌పల్లి నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కూకట్‌పల్లి నుంచి పోటీ చేస్తాననేది అవాస్తవమని చెప్పారు. తన ప్రత్యర్థులను కూకటివేళ్లతో పెకిలిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Minister Puvvada Ajay Latest comments : ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సన్నాహక సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. ఖమ్మం నగరం యావత్ తెలంగాణకు ఆదర్శమని అన్నారు. ఖమ్మం నగరం నుంచి బీఆర్ఎస్ సభకు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. తమ నగరం నుంచే బీఆర్ఎస్ జాతీయ రాజకీయ ప్రయాణానికి నాంది పడుతున్నందున ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఈ సభకు తరలివచ్చి చూపించాలని అన్నారు.
"ఎన్నికలు వచ్చిన ప్రతిసారి నా చుట్టూ అబద్ధాలు అల్లుతూ ఉంటారు. బీజేపీకి వాట్సాప్ గ్రూప్ ఉన్నట్టు.. మన దగ్గర ఓ అబద్ధాల గ్రూప్ ఉంటుంది. ఈ గ్రూప్ పనేంటంటే.. పువ్వాడ అజయ్‌ని గెలవనివ్వొద్దని.. ఈసారి హ్యాట్రిక్‌కు కొడితే ఇగ పువ్వాడను అడ్డుకోవడం కష్టమని.. అందుకని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. కూకట్‌పల్లి నుంచి నేను పోటీ చేస్తనట. కూకట్‌పల్లికి నేనెందుకు పోత.. ఈడికెళ్లే నాకు పోటీగా వచ్చెటోళ్లను కూకటివేళ్లతో ఓడగొడతా" - పువ్వాడ అజయ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
మరోవైపు ఈ సన్నాహక సభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. తెలంగాణను దేశంలో తలెత్తుకునేలా కేసీఆర్ చేశారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని చెప్పారు. మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశమంతా జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారని వెల్లడించారు.
"రైతులకు పెట్టుబడి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ రైతుబంధు ఇస్తున్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ నేడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణ వలే దేశాన్ని అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్‌గా మారింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం బాగా అభివృద్ధి చెందుతోంది" అని ఎంపీ రవిచంద్ర అన్నారు. ఈ సన్నాహక సమావేశం అనంతరం మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
నేను ఖమ్మంలోనే ఉంటా.. కూకట్‌పల్లి నుంచి పోటీ చేయను: మంత్రి పువ్వాడ