Govt Schools Problems in Khammam : అవును.. మీరు చూస్తున్నది నిజమే.. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు చాక్ పీస్‌లతో రాస్తున్నది నల్లబల్లపై కానే కాదు. ముమ్మాటికి తరగతి గోడలపైనే. ఇది ఎక్కడో మారుమూల పల్లె కాదు. ఏజెన్సీ గ్రామం అంతకన్నా కాదు. ఖమ్మం నగర నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ పాఠశాల దయనీయ పరిస్థితి. ఖమ్మం నగరంలోని రోటరీనగర్ ప్రభుత్వ పాఠశాలను.. మన బస్తీ - మన బడి కింద అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.34,90,000 కేటాయించింది.
పాఠశాలకు రంగులు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, ఫ్యాన్లు, విద్యుద్దీపాలు, పిల్లలు కూర్చునేందుకు బల్లలు ఏర్పాటు చేశారు. రంగులు వేసే సమయంలో తరగతి గదుల్లో ఉన్న బ్లాక్‌బోర్డులకు సైతం రంగులు వేశారు. తరగతి గదుల్లో గ్రీన్‌బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ పాఠశాల ప్రారంభమై దాదాపు 40 రోజులు గడుస్తున్నా.. తరగతి గదుల్లో ఎలాంటి బోర్డులు ఏర్పాట్లు చేయలేదు. దీంతో అటు నల్లబల్లలు లేక, ఇటు కొత్తగా గ్రీన్ బోర్డులు రాక ఉపాధ్యాయులు గోడలపైనే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.
"మా పాఠశాలకు మన ఊరు మన బడి కింద మరమ్మతులు పూర్తయ్యాయి. కరెంట్, తాగు నీరు, బెంచీలు ఏర్పాటు చేశారు. ఒక్క బ్లాక్‌బోర్డు లేదు. అవి కూడా త్వరలోనే ఇస్తామని చెప్పారు. ఈ రెండు నెలలు విద్యార్థులకు సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహించాం." - అరుణకుమారి, ప్రధానోపాధ్యాయురాలు
బ్లాక్‌బోర్డులు లేకుండానే తరగతుల నిర్వహణ :పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి బ్లాక్‌బోర్డులు లేకుండానే ఉపాధ్యాయులు పిల్లలకు బోధిస్తున్నారు. చదివించడం, నోట్ బుక్స్‌లో రాయించడం చేస్తుస్తున్నారు. ఫలితంగా పాఠాలు అర్థంకాక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. తరగతి గదిలో బోధన జరగాలంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పడంతో పాటు తప్పకుండా రాసి చూపించాలి. కానీ ఇక్కడ గోడల మీదే రాస్తూ పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నిస్తున్నారు.