తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మం వాసుల చిరకాల స్వప్నం సాకారం.. వైద్య కళాశాల మంజూరు - వైద్య కళాశాల

Medical College in Khammam: ఖమ్మం జిల్లా వాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకరం కానుంది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా వైద్య కళాశాలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వైద్య కళాశాల నిర్మాణానికి వైద్యారోగ్యశాఖ పరిపాలన అనుమతులు జారీ చేస్తూ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు త్వరలోనే వైద్య కళాశాల ఏర్పాటుకు నిర్మాణ పనులు జరగనున్నాయి.

Medical College in Khammam
Medical College in Khammam

By

Published : Aug 11, 2022, 6:45 PM IST

Medical College in khammam: ఖమ్మంలో మరో కొత్త మార్పు రానుంది. ఇప్పటికే ఆధునిక హంగులతో అభివృద్ధి చెందుతున్న ఖమ్మం నగరంలో నూతన వైద్య కళాశాల కొలువుతీరనుంది. అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక వైద్య సేవలను ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలకు విస్తరింపజేసింది. ఇందులో భాగంగా ప్రధాన ఆసుపత్రులకు అనుబంధంగా పలు జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేసింది. తొలి విడతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వైద్య కళాశాల ప్రకటించగా రెండో విడుతలో ఖమ్మం జిల్లా వాసులకు తీపి కబురు అందించింది.

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి 21 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం దీనికి అనుబంధంగా మంజూరైన వైద్య కళాశాల మొత్తం 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి తోడు..... కలెక్టరేట్ కార్యాలయ సముదాయాలకి చెందిన 6 ఎకరాలు, ఆర్ అండ్ బీ శాఖ కార్యాలయానికి 4 ఎకరాలను వైద్య కళాశాలకు అప్పగించారు. ఈ స్థలంలోనే వైద్య కళాశాల భవన సముదాయం, వసతి గృహం, ప్రత్యేక వార్డులు , బ్లాకులు కొలవుదీరనున్నాయి. ఇందులో భాగంగా 100 ఎంబీబీఎస్ సీట్లతో 166 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతన వైద్య కళాశాలను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఖమ్మం వాసుల చిరకాల స్వప్నం సాకారం.. వైద్య కళాశాల మంజూరు

ఖమ్మం ఆసుపత్రిలో ఇంతకుముందు అన్నిరకాల వైద్య సేవలు అందేవి కావు. రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఆసుపత్రిలో వైద్య సదుపాయల కల్పన ఏటా పెరుగుతూ వస్తోంది. కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకే కాకుండా.... పరిసర ప్రాంతాల పేద ప్రజలకు ఈ ఆసుపత్రి భరోసా కల్పిస్తోంది. ఇక్కడ దాదాపు ప్రతిరోజు 2వేల మంది ఓపీ సేవలు పొందుతున్నారు. 500 పడకలతో నిత్యం వేలాది మందికి వివిధ రకాల వైద్య సేవలు అందుతున్నాయి. ఇక్కడి మాతాశిశు ఆరోగ్య కేంద్రానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. నూతన వైద్య కళాశాల ఏర్పాటు కానున్న నేపథ్యంలో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దశాబ్దాల కలను నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంలో నూతన వైద్య కళాశాలను మంజూరు చేయడంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వైద్య కళాశాలతో ఖమ్మం అద్భుతమైన వైద్య విజ్ఞాన కేంద్రంగా నిలుస్తోందని అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:రక్షాబంధన్‌.. ఏ గిఫ్ట్‌ ఇవ్వాలో ఆలోచిస్తే.. ఇది మీకోసమే!!

యమునా నదిలో పడవ మునక.. 50 మందితో వెళ్తుండగా..!

ABOUT THE AUTHOR

...view details