Ponguleti Srinivas reddy controversy : రాష్ట్రంలో అధికార పార్టీకి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య అంతరం మరింత పెరుగుతోంది. ఇప్పటికే సొంతపార్టీపై ఇప్పటివరకు పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టిన మాజీ ఎంపీ.. ఒక అడుగు ముందుకేసి ప్రత్యక్ష యుద్ధానికి దిగినట్లే కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలను కలిసేందుకు ఆత్మీయ సమావేశాలకు శ్రీకారం చుట్టారు.
BRS Reaction to Ponguleti Action : ఇందులో భాగంగా పినపాక నియోజకవర్గంలోని మణుగూరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆత్మీయ సమావేశంలో సొంత పార్టీపై వాగ్బాణాలు సంధించారు. పార్టీ పేరు, అధినేత పేరు ప్రస్తావించకుండానే అసమ్మతి గళం వినిపించారు. కేసీఆర్ పిలుపుతో పార్టీలో చేరినా తనకు ఏ గౌరవం దక్కిందో కార్యకర్తలకు తెలుసని వ్యాఖ్యానించారు. కచ్చితంగా రాజకీయం చేసి తీరతానంటూ ప్రకటించడమే కాకుండా ప్రజల ఆశీర్వాదం కోసం ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్తానంటూ తెలిపారు.
భద్రత తొలగించడం, ఎవరు వెళ్లినా ఫర్వాలేదంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి ఒకింత గట్టిగానే స్పందించారు. జనవరి 1నుంచి జరుగుతున్న పరిణామాలు, మాజీ ఎంపీ పొంగులేటి తీరు, రాజకీయ ప్రకటనలపై బీఆర్ఎస్ అధిష్ఠానం తీవ్రంగానే పరిగణిస్తున్నట్లు తెలిసింది. పార్టీ పేరు ప్రస్తావించకుండానే తిరుగుబావుటా ఎగురవేస్తుండటం, పార్టీ గీత దాటి వ్యాఖ్యాలు చేస్తుండటం, ఫ్లెక్సీల్లో పార్టీ అధినేత ఫోటోలు లేకుండానే ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తుండటంపై అధిష్ఠానం సమగ్ర వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.