ఖమ్మం జిల్లా వైరా పురపాలక సంఘంగా ఏర్పడి ఏడాది గడుస్తున్నా నేటికి పంచాయతీ స్థాయి సేవలే అమలవుతున్నాయి. చాలీ చాలనీ సిబ్బంది, నిధుల కొరతతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయి. పట్టణంలో ఏ కూడలి చూసినా బురదమయం. పర్యటక ప్రాంతంగా గుర్తింపు పొందిన వైరా జలాశయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా మురుగుతో నిండి ఉంది. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులు రహదారిని చూసే వెనుదిరుగుతున్నారు. బస్టాండ్ ప్రాంగణం, డీఎస్పీ కార్యాలయం, మధిర రోడ్, ఖమ్మం-రాజమండ్రి జాతీయ రహదారి వెంట చాలా రోజులుగా నీరు నిలిచి పాకుడు పడుతున్నాయి.
అవస్థలు పడుతున్న జనం
నరగరపంచాయతీగా ఉన్నప్పుడు వైరాలో సోమవరం, గండగుల పాడు, బ్రాహ్మణపల్లి మాత్రమే ఉన్నాయి. కొణిజర్ల మండలంలోని దుద్దెపుడి, పల్లిపాడు, లాలాపురం, శాంతినగర్ను విలీనం చేసి 31వేల జనాభా, 23వేల మంది ఓటర్లతో 20 వార్డులుగా విభజించి మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. విలీన గ్రామాల్లో పంచాయతీ పనులు చేయక, పురపాలక సౌకర్యాలకు నోచుకోక... రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యాయి. గతంలో పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణలో ఉన్న పల్లెల్ని... ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేక నానా అవస్థలు పడుతున్నారు.
ఆందోళన చేపట్టిన పట్టణవాసులు
ఖమ్మం-రాజమండ్రి జాతీయ రహదారి వెంట రెండు కిలోమీటర్ల బారున వైరా పట్టణంలో అనేక సమస్యలున్నాయి. మురుగునీరు నిలిచి దోమలు పెరిగి చుట్టుపక్కల వారు రోగాల బారిన పడుతున్నారు. మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ లేకపోవటం వల్ల ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు పడేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... స్పందన కరవైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో రెండు కిలోమీటర్లు డివైడర్లు ఉన్నప్పటికీ ఏడాదిగా సెంట్రల్ లైటింగ్ పనిచేయకపోవడం వల్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పట్టణానికి మిషన్ భగీరథ నీరు సరఫరా లేదు. పురాతన సుజలాం పథకం నుంచే వస్తాయి. పైపులు లీకవుతూ బురదనీరు వస్తున్నాయని పట్టణవాసులు ఆందోళన చేపట్టారు.