Ponguleti Srinivas Reddy Spiritual Meeting At Bhadrachalam: రాముడే ముఖ్యమంత్రి చేతిలో తొలి బాధితుడనీ.. రాముల వారికి ముత్యాల తలంబ్రాలు ఇచ్చే తీరిక సీఎంకు లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శల వర్షం కురిపించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, భారీగా కార్యకర్తలు హాజరయ్యారు.
భద్రాద్రి రామాలయాన్ని బాగు చేయలేని సీఎం దేశాన్ని బాగు చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గోదావరి వరదలకు గురవుతున్న భద్రాచలం చుట్టు పక్కల ఉండే గ్రామాలను రక్షించడానికి రూ.1000 కోట్లతో కరకట్టను అభివృద్ధి చేస్తానని సీఎం మాట ఇచ్చిన దాదాపు 8 నెలలు అవుతుందన్నారు. అయినా ఇప్పటివరకు తట్టమట్టి కూడా వేయలేదని సీఎంపై ధ్వజమెత్తారు. నిర్మించి ఏళ్లు గడుస్తున్న భద్రాచలంలో డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభించే తీరిక ఈ ముఖ్యమంత్రికి లేదా అని ఎద్దేవా చేశారు. రాముడి తర్వాత ఈ సీఎం చేతిలో మోసపోయింది మాత్రం గిరిజనులే అని అన్నారు.
గ్రూప్-1 రాసిన ప్రతి అభ్యర్థికి రూ. లక్ష ఇవ్వాలి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో విపక్షాలకు నోటీసులు పంపించారు.. తప్ప మంత్రులపై ఆరోపణలు వస్తున్నాయి వారికి ఎందుకు నోటీసులు పంపలేదని పొంగులేటి ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ సభ్యులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు ఈ టీఎస్పీఎస్సీ బోర్డునే రద్దు చేయాలని సూచించారు. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారిన సిట్‌తో.. విచారణ జరిపించకుండా విశ్రాంతి జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఈరోజు వరకు ఎవరికీ నిరుద్యోగ భృతిని ఇవ్వలేదని గుర్తు చేశారు.