Paddy Crop Damage in khammam : ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టు(Nagarjuna Sagar Dam) పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సీజన్ అనుకూలిస్తుందని కొండంత ఆశతో సాగర్ ఆయకట్టులో పంటలు సాగుచేసిన అన్నదాతలకు.. కన్నీళ్లే మిగులుతున్నాయి. ముఖం చాటేసిన వర్షాలకు తోడు వెలవెలబోతున్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేకపోవడంతో పంటల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సాగునీరందక పొట్టదశలో ఉన్న వరి పైర్లు(Paddy) ఎండిపోతూ.. రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నాయి. మరికొన్ని రోజులు ఇలాంటి పరిస్థితులు ఉంటే.. ఆశలు వదులుకోవాల్సిందేనని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు.
khammam Paddy Crop Damage :ఈ ఏడాది కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఎగువన సరైన వర్షాలు లేని కారణంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, జలాశయాలు వట్టిబోతున్నాయి. ఎగువ నుంచి కృష్ణమ్మ ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. దీంతో ఆయకట్టుకు సాగునీరందించే పరిస్థితి లేకుండా పోయింది. ఏటా జలాశయాల్లో నీటి చేరికను బట్టి జులై మొదటి వారం నుంచి ఆగస్టు రెండో వారం వరకు సాగర్ జలాశయం నుంచి పాలేరుకు, అక్కడి నుంచి జిల్లాలో సాగర్ ఎడమ కాలువ రెండో జోన్కు నీరందించిన సందర్భాలు ఉన్నాయి.
Nagarjuna Sagar Project Water Supply in Khammam :ఈ ఏడాది ఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయింది. సాగర్ ఆయకట్టు పరిధిలో ఖమ్మం జిల్లాలో మొత్తం 17 మండలాలు ఉన్నాయి. ఆయకట్టు పరిధిలో వరి, మొక్కజొన్న, మిర్చి పంటలు సాగైనప్పటికీ.. అత్యధికంగా రైతులు వరి సాగు చేసేందుకే మొగ్గు చూపారు. సాగర్ ఆయకట్టు పరిధిలో 2,54,274 ఎకరాలు ఉండగా.. 80 వేలకు పైగా ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. ఏటా వానాకాలంలో దాదాపు లక్షన్నర ఎకరాల వరకు వరి సాగు చేస్తుంటారు. కానీ ఈ సీజన్ ఆరంభం నుంచి పరిస్థితులను రైతులు గమనిస్తూనే ఉండి సాహసం చేయలేక వరి వేయలేదు. వరి వేసిన అన్నదాతలు మాత్రం.. సాగు నీరు లేక ఎండిపోతున్న పంటను చూసి లబోదిబోమంటున్నారు.