ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జేవీఆర్ ఒకటో నెంబర్ ఓపెన్‌కాస్ట్ 2005లో ప్రారంభమైంది.ఈ గని ప్రభావం సమీపంలో ఉన్న ఎన్టీఆర్ నగర్ వాసుల జీవన స్థితిగతుల్ని పూర్తిగా మార్చేసింది. నిత్యం బొగ్గు వెలికితీత కోసం జరిగే బాంబు పేలుళ్లు, గని నుంచి ఉత్పన్నమయ్యే కాలుష్యంతో కాలనీవాసులు కొన్నేళ్లుగా సహవాసం చేస్తున్నారు. కాలనీలో మొత్తం 700 ఇండ్లున్నాయి. దాదాపు 3వేల వరకు జనాభా ఉంటారు. ఉపరితల గనిలో బొగ్గు వెలికితీత ప్రారంభమైన నాటి నుంచే కాలనీ వాసులకు కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత బొగ్గు వెలికితీత క్రమక్రమంగా పెరిగి దాదాపు పదేళ్లుగా ఈ ప్రాంత వాసులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నారు. బాంబు పేలుళ్ల ధాటికి ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంటిగోడలు, ప్రహారీలు బీటలు వారాయి. ఇళ్ల పైకప్పులు పెచ్చులూడిపోయాయి. స్లాబులు పెచ్చులూడి ఎప్పుడు నెత్తిన పడుతాయో అని కాలనీ వాసులు భయంభయంగా బతుకీడుస్తున్నారు. దుమ్ము, పొగ వల్ల పీల్చే గాలి, తాగే నీరు కూడా కలుషితమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు..
వర్షాకాలం వస్తే.. ఎన్టీఆర్నగర్ కాలనీ వాసుల ఇబ్బందులు అన్నీఇన్ని కావు. బాంబు పేలుళ్లతో దెబ్బతిన్న ఇళ్లల్లోకి వర్షపు నీరు వచ్చి చేరి గోడలు తడిసి నిమ్మెక్కుతున్నాయి. చేసేదేం లేక చాలామంది ఇళ్లపై పట్టాలు కప్పుకోగా.. కొంతమంది భయంతో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. తమకు న్యాయం చేయాలని ఏళ్ల తరబడి ఆందోళనలు చేశారు. పలుమార్లు ఓసీ పనులను అడ్డుకున్నారు. జేవీఆర్ గని కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులకు తమ గోడు మొరపెట్టుకున్నారు. కానీ.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో డీఎంఎఫ్ నిధులు మంజూరు చేసి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. కనీసం ఇళ్లకు మరమ్మతులైనా చేయించాలని సింగరేణిని వేడుకున్నారు. ఇక గని పేలుళ్లతో అనారోగ్యం బారిన పడుతున్నామని.. వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకొని తమ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నారు.