Khammam News: ఖమ్మం జిల్లాలో కోతులు, కుక్కల బెడద ఎక్కువై పోయింది. కోతులు, కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది. రహదారిపై వెళ్లే వారిపై వెంటపడి దాడికి పాల్పడుతున్నాయి. గుంపులు గంపులుగా చేరి నానా యాగీ చేస్తున్నాయి. వాటి వల్ల ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా భయపడాల్సిన పరిస్థితి. ఒంటరిగా వెళ్లాలంటేనే జనం జంకాల్సి వస్తోంది. కుక్కలు, కోతులు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. వీధుల్లో కుక్కలు, ఇళ్లపై కోతులతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.
పట్టించుకోని అధికారులు: ఖమ్మం నగరపాలికతో పాటు వైరా, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు పట్టణాల్లో కుక్కలు, కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఇతర ప్రాంతాల్లో పట్టుకున్న కుక్కలను... ఖమ్మంలోని పలు ప్రాంతాల్లో వదిలి వేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. మూడేళ్లుగా గణనీయంగా పెరిగిన వాటి సంఖ్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.