కరోనా మహమ్మారి నియంత్రణ కోసం నిరంతరం కష్టపడుతున్న పోలీస్, వైద్య, పారిశుద్ధ్య, రెవెన్యూ శాఖల అధికారుల సేవలు మరువలేనివని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజరలోని కాశీ విశ్వనాథ ఆలయం ఆవరణలో ప్రభుత్వ అధికారులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పోలీస్, రెవెన్యూ ,వ్యవసాయ, వైద్య, విద్యుత్ ,నీటి పారుదల ,పౌరసరఫరాల శాఖలతోపాటు సేవలందిస్తున్న మిగతా శాఖల అధికారులను సండ్ర వెంకటవీరయ్య శాలువాతో ఘనంగా సన్మానించారు.
వారంతా సైనికులే: ఎమ్మెల్యే సండ్ర
కరోనా సమయంలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ సైనికులేనని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లాలో 2.30 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం ఎగుమతి చేస్తే... అందులో 1.10 లక్షల టన్నులు సత్తుపల్లి నియోజకవర్గం నుంచే ఎగుమతి చేయడం విశేషమని తెలిపారు.
లాక్డౌన్ సమయంలో ప్రజలకు నిరంతర విద్యుత్తు అందిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది సేవలను కొనియాడారు. కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడగా... ప్రభుత్వ వైద్యులు ప్రజల్ని బతికించారనే అనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని పేర్కొన్నారు.
కరోనా కష్ట కాలంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలతోపాటు దాదాపు పదివేల మంది చేతి వృత్తిదారులకు దాతల సహకారంతో నిత్యావసర సరకులు అందించామన్నారు. అంతే కాకుండా12 గోశాలకు 246 ట్రాక్టర్ల పశుగ్రాసం వితరణగా ఇచ్చామన్నారు.