ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో శనివారం గాలివాన సృష్టించిన బీభత్సానికి నష్టపోయిన బాధితులను స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. పత్తి మిల్లు పైకప్పు రేకులు లేచిపోయి గోడలు దెబ్బతినడం వల్ల సుమారు 40 లక్షల మేర నష్టం వాటిల్లిందని జిన్నింగ్ మిల్లు యాజమాని సత్యంబాబు సండ్ర దృష్టికి తీసుకెళ్లారు.
గాలివానతో నష్టపోయిన బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే
సత్తుపల్లి మండలంలో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. దీనితో తీవ్రంగా నష్టపోయిన బాధితులను స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు.
నష్టపోయిన మామిడి తోటలను సందర్శించిన ఎమ్మెల్యే... పంట నష్టం అంచనా వేయాలని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. మండలంలో పలు గ్రామాల్లో గాలివాన బీభత్సానికి సుమారు 106 విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయని ట్రాన్స్‌కో డీఈ వెంకటేశ్వరరావు సండ్రకు వివరించారు.
అనంతరం కొప్పుల వెంకట్ రావుకు చెందిన కోళ్ల ఫారంలో 10 లక్షల మేర నష్టం జరగడం వల్ల ఆయనను కలిసి ఓదార్చారు. అదే గ్రామంలో డ్రైవర్ పల్లి నరసింహ మూర్తి చెందిన 9 ఎకరాల మామిడితోట పరిశీలించగా పెద్ద ఎత్తున మామిడికాయలు నేలరాలి... మామిడి చెట్లు నేలకొరిగాయి. సుమారు 7 లక్షల మేర నష్టం జరిగిందని బాధితులు ఎమ్మెల్యేకు వివరించారు. అలాగే ఇళ్లు దెబ్బతిన్న బాధితులను కూడా పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబాలకు అందేలా చూడాలని తహసీల్దార్ మీనన్‌కు సూచించారు.