Political Heat Between CPM and BRS parties on Paleru Seat: అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్-కమ్యూనిస్టుల పొత్తుపై ఆసక్తి నెలకొంది. మునుగోడు ఉపపోరు నాటి నుంచే ఇరుపక్షాల మధ్య మిత్రబంధం ఏర్పడింది. ఖమ్మం వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తర్వాత మరింత బలపడింది. ఇటీవల అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు ఖమ్మంనకు వచ్చిన సీఎం కేసీఆర్ వెంట సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, కూనంనేని కలిసి పర్యటించారు.
MLA Kandala Responded to Tammineni Comments: ఈ పరిణామాలన్నీ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్-సీపీఎం కలిసి నడుస్తాయన్న స్పష్టత వచ్చింది. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం జన చైతన్య యాత్రకు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. కూసుమంచిలో జరిగిన సభలో కందాల ఉపేందర్ రెడ్డి సమక్షంలో తమ్మినేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలేరు స్థానం అత్యంత ప్రాధాన్యతని వ్యాఖ్యానించారు. పాలేరు స్థానం సీపీఎం పార్టీకి కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గట్టిగా పట్టుబడతామన్నారు. తమ్మినేని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తాజాగా దీటుగా స్పందించారు.
ప్రజలు కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయంటూనే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తానే పోటీ చేసి గెలుస్తానన్నారు. ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో పాలేరు నియోజకవర్గం హాట్ టాపిక్‌గా ఉంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలో నిలుస్తానంటూ ప్రకటించారు. ఈ మార్చ్ నెలాఖరులో పాలేరు నుంచి జిల్లాలో బస్సు యాత్రకు ఆమె శ్రీకారం చుట్టనున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఈసారి టికెట్ తనదేనంటూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమాగా ఉన్నారు.