మూస విధానాల్లో ఒకే రకమైన పంటలు సాగుచేస్తూ నష్టాలు చవిచూసే రైతులకు..... లాభాలు పొందడం ఎలాగో చేసి చూపుతున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన నరసింహారావు. తల్లాడ మండలం మంగాపురంనకు చెందిన రైతు...ఏళ్లుగా ఆకుకూరలు సాగు చేస్తున్నాడు. ఒకే రకమైన ఆకుకూరలు పండిస్తే లాభం లేదనుకున్న నరసింహారావు... పుదీనా సాగుపై దృష్టిపెట్టాడు. గుంటూరు జిల్లా కుంచెనపల్లిలో నెల పాటు ఉండి సాగు మెళకువలు తెలుసుకున్నాడు. అక్కడి నుంచే తెచ్చుకున్న నాటు పుదీనా మొక్కలను పొలంలో రెండు వైపులా తిరగనాటుకుంటూ లాభాల పంట పండిస్తున్నాడు.
పుదీనా పంట.. రైతుకు లాభాలు తెచ్చెనంట! - profits with mint farming
రైతులు నష్టాల కష్టాల నుంచి బయటపడాలంటే....పంటమార్పిడీ, నూతన విధానాలు అవలంబించడం అత్యంత ఆవశ్యకమని ప్రభుత్వం, శాస్త్రవేత్తలు నిత్యం చెబుతుంటారు. డిమాండ్ ఉన్న పంటలు పండించి లాభాల బాటలో నడవాలని సూచిస్తుంటారు. అదే మార్గంలో నడుస్తూ లాభాల పంట పండిస్తున్నాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు. పుదీనా సాగుచేస్తూ తోటి అన్నదాతలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
తనకున్న ఐదెకరాల పొలంలో మిరప, మొక్కజొన్న, ఆకుకూరలు సాగు చేస్తున్న నరసింహరావు....ఒక ఎకరంలో పుదీనా వేశాడు. సేంద్రీయ పద్దతులు, బిందు సేద్యంతో తక్కువ పెట్టుబడితో అధిక రాబడులు పొందుతున్నాడు. తానే నేరుగా దుకాణాలకు అమ్ముతూ...మంచి ఆదాయం తెచ్చుకుంటున్నాడు. నెలకు 40వేల రూపాయల వరకు ఆదాయం వస్తోందని నరసింహారావు చెబుతున్నాడు. తన కుటుంబంతో పాటు మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ... పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. మూస పంటలు, విధానాలు విడిచి డిమాండ్ ఉన్న పంటలు పండిస్తే ఎవరైనా లాభాలు పొందవచ్చని నరసింహరావు సూచిస్తున్నాడు.
తక్కువ ఖర్చుతో వినూత్నమైన ఆలోచనలతో లాభాలు పంట పండిస్తున్న నరసింహారావు జిల్లాలోని ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
- ఇదీ చూడండి :రంగురంగుల కాలీఫ్లవర్లతో రైతుకు లాభాల పంట