తెలంగాణ

telangana

ETV Bharat / state

త్రివేణి సంగమంలో.. సంగమేశ్వరస్వామి కల్యాణం - telangana news

మహాశివరాత్రి వేడుకలతో శైవక్షేత్రాలు కళకళలాడుతాయి. సాధారణంగా ఆలయాల్లో ఒక్కరోజే ఉత్సవాలు జరగగా... ఖమ్మం జిల్లాలోని తీర్థాల సంగమేశ్వర ఆలయంలో మాత్రం ఐదు రోజులు జాతర జరుపుకుంటారు. ఇక్కడ అలహాబాద్ తరహాలో శివపార్వతుల కల్యాణం జరగడం విశేషం. 5 రోజుల పాటు జరగనున్న జాతరకు భక్తజనం పోటెత్తారు.

maha-shivratri-celebrations-at-sangameshwara-temple-in-khammam-district
త్రివేణి సంగమంలో.. సంగమేశ్వరస్వామి కల్యాణం

By

Published : Mar 12, 2021, 12:00 PM IST

ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాలలో చారిత్రక సంగమేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా మొదలైన జాతర అశేష భక్త జనసందోహం మధ్య వైభవంగా సాగుతోంది. ఏటా శివరాత్రి రోజున మొదలై ఐదురోజుల పాటు సాగనున్న ఈ తీర్థాల జాతరకు వేలాది భక్తజనం తరలి వస్తున్నారు. దేశంలో అలహాబాద్ తరహాలో త్రివేణి సంగమం ఖమ్మం జిల్లాలోనూ ఉండటం ఈ జాతర ప్రత్యేకత. మున్నేరు, ఆకేరు, బుగ్గేరుల పేరిట ఈ సంగమం ఏర్పడింది.

ఏటా శివరాత్రి నాడు జరిగే సంగమేశ్వర జాతర భక్తులకు భక్తి పారవశ్యాన్ని కలిగిస్తోంది. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ శివునికి గంగ, పార్వతులతో కలిసి కల్యాణం నిర్వహించడం తీర్థాల సంగమేశ్వర ఆలయం ప్రత్యేకత. రెండుగుల వెడల్పు, నాలుగడుగుల పొడవుతో పాలరాతి శివలింగముంది. ఈ ప్రాంతాన్ని ఖమ్మం జిల్లా త్రివేణి సంగమంగా భక్తులు కొలుస్తారు.

త్రేతాయుగంలో శివపార్వతులు, మహారుషులతో కలిసి శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని తిలకించి తిరుగు ప్రయాణంలో మూడు నదులు కలిసి ఉన్న ప్రదేశం సుందరంగా కన్పించడంతో కాసేపు సేదదీరానీ..ఈ ప్రదేశం నుంచి వెళ్లే సమయంలో తనకు ఆలయం నిర్మించాలని శివుడు మహారుషులతో కోరడంతో...మహారుషులు మూడు నదులు కలిసేచోట శివలింగాన్ని ప్రతిష్టించి, మౌదల్య పేరుతో మున్నేరు, ఆత్రేయ పేరుతో ఆకేరు, భృగ్ మహర్షి పేరుతో బుగ్గేరు అని మూడు నదులకు నామకరణం చేసి తామరాకులపై తాళపత్ర గ్రంథాన్ని రాసి అక్కడే ఉంచి వెళ్లిపోగా.. ఇక్కడ గంగా పార్వతి సమేత సంగమేశ్వర ఆలాయన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇలా చారిత్రక ఆలయం కావడంతో ప్రతీ ఏటా మహాశివరాత్రి పర్వదినం వేళ..వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి..సందర్శించుకుంటారు.

చారిత్రక నేపథ్యం ఉన్న జాతర కావడంతో భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ఐదురోజుల పాటు సాగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఇందుకోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూలైన్లు, మున్నేరులో స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. జాతర జరిగే ఐదురోజుల పాటు భక్తజనం అధిక సంఖ్యలో రానుండటంతో...పోలీస్ యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది.

ABOUT THE AUTHOR

...view details