కంప్యూటర్ యుగంలో పుస్తకాలకు తగ్గుతున్న ఆదరణ ఆయనలో ఆవేదన నింపింది. పుస్తక పఠనాన్ని మరుగునపడేస్తున్న నేటి యువత భవిష్యత్తు ఆందోళన కలిగించింది. ఆ తరుణంలోనే పుట్టిన ఓ ఆలోచనే... సగటు ఉపాధ్యాయుడికి సమాజంపై ఉన్న ఆలోచనకు అద్దం పట్టింది. ఖమ్మం పట్టణానికి చెందిన పారుపల్లి అజయ్‌కుమార్ విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయన సతీమణి దుర్గాభవాని సైతం ఉపాధ్యాయురాలే.
నేటి యువతలో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందిచాలన్న ఆయన ఆలోచనకు... భార్య సహకారం తోడవటంతో వెంటనే లకారం సర్కిల్ వద్ద గ్రంథాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. గ్రంథాలయ నిర్వహణ కోసం సొంతింటిని నిర్మించి, భవనం కింది భాగంలో ప్రత్యేకంగా గ్రంథాలయ హాల్‌ను నిర్మించారు. 50 మందికి కూర్చునేలా విశాలమైన రీడింగ్ హాల్, పార్కింగ్ సౌకర్యం, మంచినీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పించారు.
పుస్తక పఠనం పెంచాలనే లక్ష్యంతో అజయ్‌కుమార్ ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయానికి ఉచిత ప్రవేశం కల్పించారు. ఉదయం 7నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఈ గ్రంథాలయం తెరిచే ఉంటుంది. మ్యాగజైన్లు, దినపత్రికలు, సాహిత్యం, కళలు, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఆంగ్లం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంటాయి.