Heavy Rain In Khammam District : ఎడతెరిపి లేకుండాకురుస్తన్న భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన జలాశయాలు, సాగునీటి ప్రాజెక్టులకు వరద క్రమంగా పెరుగుతుండటంతో పరవళ్లు తొక్కుతున్నాయి. వారం రోజుల క్రితం వెలవెలబోయిన పాలేరు జలాశయం.. ప్రస్తుతం పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాలైన సూర్యాపేట, వరంగల్, మహబూబాబ్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు వచ్చిచేరుతుండటంతో.. పాలేరు జలాశయం పొంగి ప్రవహిస్తోంది. రిజర్వాయర్ 24 గేట్లు ఎత్తి సుమారు 10 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తున్నాయి.
వైరా రిజర్వాయర్ మత్తడి దూకుతోంది. భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో పూర్తిస్థాయిలో నిండింది. పూర్తిస్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా.. ఇప్పటికే 19 అడుగులు దాటి ఉద్ధృతంగా అలుగులు పారుతున్నాయి. రిజర్వాయర్ ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీటితో రిజర్వాయర్ మత్తడి దూకుతోంది. అలుగులు పారుతున్నాయి. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి పెద్దచెరువు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని దాటి అలుగు పారుతోంది.
కిన్నెరసాని ప్రాజెక్టుకు జలకళ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని జలాశయానికి వరద పోటెత్తుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 403.20 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 56,000 క్యూసెక్కులు ఉంది. 5 గేట్లు ఎత్తి 29,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.