ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ వానాకాలం వ్యవసాయ శాఖ రూపొందించిన అంచనాలను ఏమాత్రం అందకుండా సాగు నమోదైంది. ప్రధాన పంటలైన వరి, పత్తి, మిరప, కంది, పెసర, మొక్కజొన్న విస్తీర్ణం బాగా పెరిగింది. వీటితోపాటు కూరగాయలు, ఉద్యాన పంటల సాగు కూడా గణనీయంగా నమోదైంది. రెండు జిల్లాల్లోనూ ప్రధాన పంటలన్నీ సాధారణ సాగు విస్తీర్ణాన్ని మించిపోవటం విశేషం. ఈ నేపథ్యంలో అత్యధికంగా దిగుబడులు వచ్చే అవకాశం ఉంచని వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తోంది.
అయితే విడువకుండా కురుస్తున్న వానలు పంట ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రధానంగా పత్తికి నష్టాలను మిగిల్చాయి. కాయలు నల్లబారిపోతున్నాయి. వాగుల ఉద్ధృతితో వరి పొలాలు మునిగి దెబ్బతిన్నాయి. సీజన్ చివరి వరకూ ఊరించిన పెసర పంట చివరకు అన్నదాతలను నిండా ముంచింది. చేతికొచ్చే సమయంలో ఉభయ జిల్లాల్లో వర్షాల కారణంగా నష్టాలే మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి మినహా ఇస్తే ఖరీఫ్ దిగుబడులపై రైతులు కొండంత ఆశతోనే ఉన్నారు. అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది.