తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఫలితాలు చూసుకోకుండానే.. అనంత లోకాలకు వెళ్లిపోయింది' - రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి... మేనమామ సంరక్షణలో పెరిగింది. బాగా చదువుకుని ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని ఇంటర్‌లో కష్టపడి చదివింది. తప్పక ఉత్తీర్ణత సాధిస్తానని బంధువులతో చెప్పుకుని మురిసిపోయింది. అనుకున్నట్లుగానే పరీక్షలో పాసైంది కానీ... విధి చేతిలో ఓడిపోయింది. తన ఫలితాలు చూసుకోకుండానే... మృత్యు ఒడికి చేరింది. వేదాద్రి ప్రమాదం మిగిల్చిన విషాదంలో ఆ విద్యార్థిని గాథ అందరినీ మరింత కంటతడి పెట్టిస్తోంది.

inter-student-died-in-major-road-accident-in-krishna-district
'ఫలితాలు చూసుకోకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది'

By

Published : Jun 19, 2020, 3:44 PM IST

Updated : Jun 19, 2020, 7:30 PM IST

'ఫలితాలు చూసుకోకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయింది'

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొన్న ఘటన అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. 12 మంది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అందులో వేమిరెడ్డి కల్యాణి అనే ఇంటర్‌ విద్యార్థిని కూడా ఉంది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన కల్యాణి... ఖమ్మం జిల్లా పెదగోపవరంలో తన మేనమామ గోపిరెడ్డి సంరక్షణలో పెరిగింది. ఎర్రుపాలెంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంది. ఫస్ట్ ఇయర్‌లో మంచి మార్కులు సాధించేందుకు బాగా కష్టపడి చదవి పరీక్షలు బాగానే రాసింది. కుటుంబీకులు, బంధువులకు మంచి మార్కులు వస్తాయని చెప్పుకొచ్చింది. ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసింది.

దైవదర్శనానికి వెళ్లి...

బుధవారం రోజున బంధుమిత్రులంతా వేదాద్రి దైవదర్శనానికి వెళ్తుంటే... వారితో పాటు వెళ్లింది. దైవసన్నిధిలోనూ గురువారం ఫలితాలు వస్తాయని... మంచి మార్కులతో పాసవుతాని కుటుంబీకులతో చెప్పింది. చివరికి మంచి మార్కులతోనే పాసైన కల్యాణి... ఫలితాలు చూసుకోకుండానే మృత్యు ఒడికి చేరింది.

పరీక్షల్లో పాసైంది... మృత్యువుతో ఓడింది...

అసలే కుటుంబ సభ్యులు, బంధువులను కోల్పోయిన దు:ఖంలో ఉన్న వేమిరెడ్డి కుటుంబం పరీక్షల్లో తమ బిడ్డ పాసైందని తెలిసి మరింతగా విలపిస్తున్నారు. మార్కులు చూసుకునేందుకు కల్యాణి ప్రాణాలతో లేకుండా పోయిందని గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఫలితాలు చూసుకుని మురిసిపోవాల్సిన సమయంలో... భగవంతుడు తమ బిడ్డను దూరం చేసి శోకంలో ముంచేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

ఇంటర్ పరీక్షల ఫలితాలు తమతో పాటు కలిసి చూసుకునే స్నేహితురాలు లేదని తోటి విద్యార్థులు కన్నీంటి పర్యంతమయ్యారు. తమతో సంతోషాన్ని పంచుకునేందుకు కల్యాణి లేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చూడండి:చైనా అధీనంలో భారత జవాన్లు ఉన్నారా?

Last Updated : Jun 19, 2020, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details