"పట్టణాల్లో హరితహారం జోరందుకోవాలి. గ్రామాల్లో మాదిరిగా పట్టణాల్లో చిట్టడవులు పెంచాలి. బడ్జెట్లో 10 శాతం మేర నిధులు హరితహారం కోసం ఖర్చు చేయాలి." జూలై 30న హైదరాబాద్లో జరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా పురపాలికల అభివృద్ధి సమీక్షలో మంత్రి కేటీఆర్ నిర్దేశించిన లక్ష్యం ఇది..! కానీ... ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మొక్కలు నాటే యజ్ఞంలో పురపాలికలు లక్ష్యం చేరుకోలేక ఆపసోపాలు పడుతున్నాయి.
సగమే నాటారు...
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మొత్తం 8 పురపాలికలు ఉన్నాయి. ఒక్కో పురపాలిక లక్ష్యం.. లక్షల్లో ఉన్నా నాటిన మొక్కలు మాత్రం వేలల్లోనే ఉన్నాయి. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో 16 లక్షల మొక్కలు నాటాల్సిఉండగా.. 2 లక్షల వరకే నాటారు. వైరా పురపాలికలో 2.02 లక్షలకుగాను 20 వేలు, మధిరలో 3.7 లక్షలకు.....50 వేలు, సత్తుపల్లిలో 2.14 లక్షల లక్ష్యం నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 50 వేల వరకే మాత్రమే నాటారు. కొత్తగూడెం పురపాలికలో లక్ష్యం 5.18 లక్షలైతే... 2 లక్షలు, పాల్వంచలో 5.20 లక్షలకు గాను రెండున్నర లక్షలే పూర్తిచేశారు. ఇల్లెందు పురపాలిక లక్ష్యం 2.19 లక్షలు కాగా....లక్షా 30 వేలు, మణుగూరు పట్టణంలో 2.86 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా కేవలం లక్షన్నరే నాటారు.