రాష్ట్రంలో తాజాగా 909.67 ఎకరాల అటవీ భూముల్లో ఆక్రమణలు, మొక్కల విధ్వంసం జరిగినట్లు అటవీశాఖ గుర్తించింది. ఈ మేరకు అత్యధికంగా కాళేశ్వరం సర్కిల్‌లోని అటవీ ప్రాంతానికి నష్టం వాటిల్లింది. తర్వాతి స్థానాల్లో రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం సర్కిళ్లు ఉన్నాయి. సర్కిళ్లు, జిల్లాల వారీగా ఆక్రమణలపై ఆధికారుల నుంచి వచ్చిన సమాచారాన్ని అటవీశాఖ విజిలెన్స్ విభాగం క్రోడీకరించింది. వివరాలను అన్ని జిల్లాల అటవీ అధికారులకు పంపించి.. ఆక్రమణలు, మొక్కల విధ్వంసంపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని డీఎఫ్‌ఓలను ప్రధాన అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) ఆదేశించారు.
ఆక్రమణలకు గురైంది సహజ అటవీప్రాంతమా? ప్లాంటేషన్ చేసిందా? అన్న వివరాల్ని పొందుపరుస్తూ నివేదిక పంపాలని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతస్థాయిలో ఈ అంశంపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుగుతుందని తెలిపారు. అక్టోబరు నెలాఖరు వరకు సమాచారాన్ని క్రోడీకరించిన అటవీశాఖ.. డివిజన్, సెక్షన్, బీట్ల వారీగా ఆక్రమణల గణాంకాల వివరాలు, సమాచారాన్ని నిర్ణీత నమూనాలో డీఎఫ్‌ఓలకు పంపించింది.
మొక్కలు తీసేస్తూ.. చెట్లను నరికేస్తూ..:హరితహారంలో భాగంగా క్షీణించిన అటవీ ప్రాంతాల్లో అటవీశాఖ ఏటా మొక్కలు నాటుతోంది. పలు ప్రాంతాల్లో స్థానికంగా కొందరు ఆ మొక్కల్ని తొలగించారు. చెట్లుగా ఎదిగినచోట నరికేశారు. ఇలా దాదాపు 150 ఎకరాలకు పైగా ప్లాంటేషన్‌కు నష్టం వాటిల్లినట్లు అటవీశాఖ గుర్తించింది. మరో 759.67 ఎకరాల అటవీప్రాంతంలో చెట్లను నరికేశారు. పలుచోట్ల పోడు ముసుగులో కబ్జాకాండ యథేచ్ఛగా సాగుతోంది. నవంబరులోనూ మరిన్ని అక్రమాలు చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ సంఖ్యను కలిపితే తాజాగా ఆక్రమణలకు గురైన అటవీ భూముల విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశాలున్నాయి.
- కాళేశ్వరం సర్కిల్‌లోని ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలో 361.07 ఎకరాల భూముల్లో ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. మంచిర్యాల జిల్లాలో 238.19, ములుగులో 73, భూపాలపల్లిలో 49.88 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి.
- ములుగు జిల్లా రామచంద్రపురం గ్రామంలో అత్యధికంగా 56 ఎకరాలు, మంచిర్యాల జిల్లా ఉత్కులపల్లిలో 54, చాకెపల్లిలో 40.50, సంకారం గ్రామంలో 37.05 ఎకరాల అటవీప్రాంతం అన్యాక్రాంతం అయింది.
- ఇతర సర్కిళ్లకు సంబంధించి.. రాజన్న సిరిసిల్లలో 251.67, భదాద్రి-కొత్తగూడెంలో 117.65, కవ్వాల్ టైగర్ రిజర్వులో 14.89, బాసరలో 29.36, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో 10.50, చార్మినార్ సర్కిల్‌లో 10.50 ఎకరాలు, యాదాద్రి పరిధిలో 1 ఎకరా అటవీ భూమి ఆక్రమణలకు గురైంది.
ఇవీ చదవండి: