Flood Effect on Khammam District 2023 : గత నెల 27, 28 తేదీల్లో మున్నేరు ఉగ్రరూపంతో ఖమ్మంలోని పలు కాలనీలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. 27వ తేదీ తెల్లవారుజామున ఒక్కసారిగా వరద వచ్చి.. కాలనీలను ముంచెత్తింది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుజీవుడా అంటూ... ఇళ్లకు తాళాలు వేసి పునరావాస కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లల్లో తలదాచుకున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతంలోఉన్న పద్మావతి నగర్, వెంకటేశ్వరకాలనీ, బొక్కల గడ్డ, మోతీనగర్, సారథినగర్, రంగనాయకుల గుట్ట, ప్రకాశ్ నగర్, ధ్వంసలాపురం తదితర ప్రాంతాల్లో నివాసాలు మునిగి పోయాయి. ఎన్నడూ లేనంతగా సుమారు 31 అడుగుల మేర వరద ప్రవహించింది.
Khammam Floods 2023 :మున్నేరు శాంతించి వరద తగ్గుముఖం పట్టడంతో తిరిగి తమ ఇళ్లకు చేరుకున్న స్థానికులు జరిగిన నష్టాన్నిచూసి కన్నీరుమున్నీరవుతున్నారు. పలు కాలనీల్లో నివాసాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొన్ని గృహాలు ఆనవాళ్లు కోల్పోయాయి. సుమారు 17వందల నివాసాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 70 ఇళ్ల వరకు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. వరదతో పాటు చెత్త.. బురద భారీగా మేట వేసింది.
'' రాత్రి పడుకునే సమయంలో చాలా వరదలు వచ్చాయి. వెంటనే ఏ సామన్లు లేకుండా ఊర్లో నుంచి వెళ్లిపోయాం. అధికారులు ముందు సమాచారం ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే విలువైన సామాన్లు అన్నీ తీసుకొని వెళ్లే వాళ్లం. ఎంతో కష్టపడి వాయిదాల పద్ధతిలో కొనుకున్న రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, మంచాలు, బంగారం కూడా నీటిలో కొట్టుకుపోయాయి. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి. - బాధితులు