Boy Died with Symptoms of Rabies Khammam : రాష్ట్రంలో వీధి కుక్కలు భౌ.. భౌ.. అంటూ భయపెడుతున్నాయి. వీధిలో ఆడుకుంటున్న చిన్నపిల్లలను వెంటపడి మరీ కరుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటన మరువక ముందే అటువంటి ఘటనే తాజాగా ఖమ్మం జిల్లాలో చోటుచేసుకొంది. జిల్లాలోని రఘునాథపాలెం మండలం పుఠానీ తండాకు చెందిన ఓ ఐదేళ్ల బాలుడు రేబిస్ వ్యాధి లక్షణాలతో ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు.
స్థానికుల కథనం ప్రకారం.. పుఠానీ తండాకు చెందిన బానోతు రవీందర్, సంధ్య దంపతుల చిన్న కుమారుడు భరత్(5) రెండు నెలల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. అదే సమయంలో బాలుడిపై సైకిల్ పడింది. గమనించిన తల్లిదండ్రులు బాలుడికి తగిలిన గాయాలు సైకిల్ మీద పడటంతో తగిలిన గాయాలనుకొని వాటికి సాధారణ చికిత్స చేయించారు. గాయాలు నయం కావడంతో ఘటనను మర్చిపోయి యథావిధిగా వారి పనుల్లో నిమగ్నమై పోయారు.
ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా బాలుడు అస్వస్థతకు గురికావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాలుడు పరిస్థితిని గమనించిన అక్కడి వైద్యులు రేబిస్ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే హైదరాబాద్ నిమ్స్‌కు తరలించాలని సూచించారు. దీంతో బాలుడ్ని హైదరాబాద్ తరలిస్తుండగా.. అర్ధరాత్రి సమయంలో మార్గమధ్యలో మృతి చెందాడు.