తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో 30 రోజుల ప్రణాళిక పనులపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి

ఖమ్మం జిల్లాలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులపై పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లోని చెత్తా చెదారాన్ని, అపరిశుభ్రతను పరిశీలించిన ఆయన అధికారులపై మండిపడ్డారు. వారం రోజుల్లో మరోసారి పర్యటనకు వస్తానని, ఆలోగా మార్పు కనిపించకపోతే సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు.

ఖమ్మంలో 30 రోజుల ప్రణాళిక పనులపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి

By

Published : Oct 2, 2019, 7:23 PM IST

ఖమ్మం జిల్లాలో చేపడుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక పనులపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏన్కూరు మండలం భగవాన్‌నాయక్‌తండాలో ఏర్పాటు చేసిన సభలో ఉన్నతాధికారులకు తన అసహనాన్ని తెలిపారు. ఖమ్మం నుంచి వస్తూ గ్రామాలను పరిశీలించిన ఆయన... పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎక్కడి చెత్త అక్కడే పోగుపడి ఉండటం, రోడ్డు పక్కనే సీసాలు పడి ఉండటం గమనించిన మంత్రి... గ్రామ సభలో కలెక్టర్‌, పంచాయతీ అధికారులను ప్రశ్నించారు. సుమారు గంట పాటు సభలో వివిధ అంశాలపై సర్పంచి, జిల్లా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. గ్రామాభివృద్ధికి శ్రమదానం చేసే వారి పేర్లను గ్రామ పంచాయతీ నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు గోడలపై రాయాలని, ఆర్థిక స్థోమత ఉండీ కూడా ఊరికి ఉపయోగపడని, శ్రమదానం చేయని వారి పేర్లు కూడా రాయాలన్నారు. ఈ పర్యటన తనకు సంతృప్తిగా లేదని... మళ్లీ వారం రోజుల్లో పరిశీలనకు వస్తానన్నారు. పరిస్థితిలో మార్పు కనిపించకపోతే పంచాయతీ కార్యదర్శి నుంచి పైఅధికారి వరకు అందరిని సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. దాతల గురించి ప్రస్తావిస్తూ స్థానిక ఎమ్మెల్యే రాములునాయక్‌ను 'మీ కొడుకు గట్టోడేనంటగా.. దాతగా ఊళ్లు బాగు చేయించా'లని చమత్కరించారు. మంత్రి ప్రసంగం ఓ పక్క నవ్వులు కురిపిస్తూనే... మరో పక్క అధికారులు, ప్రజాప్రతినిధులకు చురకలు అంటించింది.

ఖమ్మంలో 30 రోజుల ప్రణాళిక పనులపై మంత్రి ఎర్రబెల్లి అసంతృప్తి

ABOUT THE AUTHOR

...view details