ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని అంకంపాలెం గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలను 2017 జులైలో అప్పటి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు గతేడాది వరకు 260 మంది విద్యార్థినులు ఉన్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య దాదాపు 500కు చేరుతోంది.
తొలి రెండేళ్లలో పిల్లలు గదుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరకొర వసతులతో సతమతమయ్యారు. తాత్కాలికంగా విద్యార్థినుల కోసం షెడ్లను నిర్మించినా అవి అవసరాలను తీర్చలేకపోయాయి. ఇక్కడ మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. విద్యార్థినుల సంఖ్య పెరిగితే ఈ ఏడాది ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉందని అధ్యాపకుల విజ్ఞప్తి మేరకు ఖమ్మం సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాల భవనాల్లోకి మార్చారు.
తరలిపోయిన చదువులమ్మ... తిరిగి వచ్చేదెన్నడమ్మా..?
కోటి రుపాయలతో భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని పీవో గౌతమ్ ఐటీడీఏ డీఈఈ రామారావుని ఆదేశించారు. భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యే నాటికే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఇంకెంత కాలం పడుతుందోనని గ్రామస్థులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరలిపోయిన చదువులమ్మ.. తిరిగి తమ ప్రాంతానికి ఎప్పుడు వస్తుందోనని వాపోతున్నారు.