ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్నికల్లో గులాబీ పార్టీ మద్దుతుదారులకే రైతులోకం పట్టం కట్టింది. 90 సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో... 80చోట్ల తమ మద్దతుదారులను గెలిపించుకుని... తొలిసారి డీసీసీబీ పీఠంపై గులాబీ జెండా ఎగరవేయనుంది. డీసీసీబీ, డీసీఎంఎస్‌లోని అన్ని డైరెక్టర్ పదవులనూ ఏకగ్రీవంగా గెలుచుకున్న తెరాస.... ఛైర్మన్ ఎన్నికకు సన్నద్ధమవుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచీ.... గెలుపొందిన వారు పట్టుజారిపోకుండా శిబిరాలకు తరలించిన గులాబీ పార్టీ... ఛైర్మన్ ఎంపికలోనూ వ్యూహాత్మకంగా వ్యహవరిస్తోంది. జిల్లా ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల సమన్వయంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్... ఛైర్మన్ అభ్యర్థి ఎంపికకు తీవ్ర కసరత్తులు చేశారు. 16 మంది డీసీసీబీ, 8 మంది డీసీఎంఎస్ డైరెక్టర్లు శిబిరాల నుంచి ఇవాళ ఉదయం నేరుగా డీసీసీబీ కార్యాలయానికి రానున్నారు.
డీసీసీబీ పీఠం బీసీ నేతకే!
ఈ సారి ఖమ్మం డీసీసీబీ పీఠం బీసీ నేతకు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పదవి కోసం పోటీ ఎక్కువగా ఉన్నా... సామాజిక సమీకరణలను పార్టీ కీలకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి కూరాకుల నాగభూషయ్య, కమ్మ సామాజిక వర్గం నుంచి తుళ్లూరి బ్రహ్మయ్య ఛైర్మన్ పదవి ఆశిస్తుండగా... మంత్రి సన్నిహితుడు, బీసీ నేత అయిన కూరాకులకే పీఠం దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఛైర్మన్ కాకపోతే వైస్‌ఛైర్మన్ పదవి కోసం బ్రహ్మయ్య పోటీపడుతుండగా... మధిరకు చెందిన మరోనేత ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి ఆశిస్తున్నారు. డీసీఎంఎస్ ఛైర్మన్ పదవి సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన రాయల శేషగిరిరావుకు దక్కవచ్చునని పార్టీ వర్గాల సమాచారం.