khammam Cotton Farmers Problems: ఖమ్మం జిల్లాలో 1,79,287 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,99,720 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. అయితే ఉమ్మడి జిల్లాలోపత్తి రైతులకు ఈ వానాకాలం సీజన్ కలిసి రాలేదనే చెప్పాలి. సీజన్ ఆరంభం నుంచీ అన్నదాతకు కాలం పరీక్ష పెడుతూనే ఉంది. తొలకరి పులకరింతతో జూన్ నెలలోనే రైతులు పత్తి విత్తనాలు నాటారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వర్షాలు ముఖం చాటేయడంతో రైతులు రెండు మూడు సార్లు విత్తనాలు నాటాల్సి వచ్చింది. దీంతో సాగుదారుపై అదనపు భారం తప్పలేదు. ఇంత చేసినా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు పడకపోవడంతో పాటు.. పత్తికి తెగుళ్లు సోకడంతో పంట ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడింది. ఆశించిన స్థాయిలో పంట ఎదుగుదల లేకపోవడంతో అన్నదాతలు అదనపు పెట్టుబడులు పెట్టారు. ఎండల తీవ్రత పెరగడంతో పత్తి తోటలు వడబడి పోతున్నాయి.
Cotton Farmers Problems Telangana 2023 : ప్రతికూల వాతావరణం.. పత్తి రైతులకు శాపం
Cotton Farmers Problems Telangana 2023 : వాతావరణ పరిస్థితులు, పత్తిలో ఎదుగుదల లోపించడం పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నానా కష్టాలు పడి ఎంతో కొంత పంట చేతికొచ్చినా.. భారీగా దిగుబడులు పడిపోవడంతో రైతులు కుంగిపోతున్నారు. ఉభయ జిల్లాల్లో ఇప్పుడిప్పుడే పత్తి తీసి విక్రయించేందుకు మార్కెట్‌కు తీసుకొస్తున్న సాగుదారులు నష్టాలే మూటగట్టుకుంటున్నారు. సాధారణంగా వర్షాలు కురిసి, ఎదుగుదల బాగుంటే మూడు విడతలుగా తీస్తే పత్తి ఆశించిన స్థాయిలోనే వస్తుంది. ఎర్రనేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు, నల్లరేగడి భూముల్లో 15 నుంచి 20 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వచ్చేది. కానీ ప్రస్తుతం ఎర్రనేలల్లో 5 క్వింటాళ్లు, నల్లరేగడి భూముల్లో 7 క్వింటాళ్లు కూడా పత్తి దిగుబడులురావడం లేదు. ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడి రావడమే గగనంగా మారిందని రైతులు వాపోతున్నారు.