Collection of trade licenses is high in Khammam: ఖమ్మంలో ట్రేడ్ లైసెన్సుల ఫీజుల పెంపుతో వ్యాపార వర్గాలు లబోదిబోమంటున్నాయి. నగరపాలక సంస్థ పరిధిలో దాదాపు 6వేల వరకు ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి. ప్రతి వ్యాపారి బల్దియాకు వ్యాపార అనుమతి సుంకం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దుకాణాలను బట్టి 500 నుంచి సుమారు 5 వేల వరకు వ్యాపారులు ట్రేడ్ లైసెన్సు రుసుం చెల్లించేవారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వ్యాపార సుముదాయం, దుకాణాల విస్తీర్ణం, చదరపు అడుగులు, అంతస్తుల వారీగా లెక్కగట్టి రుసుం వసూలు చేస్తున్నారు. 100 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఉన్న దుకాణాలపై చదరపు అడుగుకు 5 రూపాయలు, 60 అడుగుల రోడ్డుకు అనుకుని ఉన్న దుకాణాలపై 4 రూపాయలు, 30 అడుగుల రోడ్డుకు అనుకుని ఉన్న దుకాణాలపై 3రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.
తాజా నిబంధనలు వ్యాపారవర్గాలను హడలెత్తిస్తున్నాయి. కరోనా రెండేళ్లపాటు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆదాయం లేక వ్యాపారాలు వెలవెలబోయాయి. ఈ మధ్య కాలంలోనే ఊపందుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ట్రేడ్ లైసెన్సుల ఫీజుల రూపంలో పెనుభారం పడుతుండటంతో వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థకు భవనాల యజమానులు పన్ను చెల్లిస్తున్నారు. జీఎస్టీ లైసెన్సులు తీసుకోక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో ట్రేడ్ లైసెన్సుల పేరిట అధిక రుసుంలు వసూలు చేయడంపై వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. షాపు చిన్న మొత్తంలో ఉన్న పెద్ద మొత్తంలో ఉన్నా అధిక వసూలు చేపడుతున్నారని, షాపు అద్దె కన్నా ఎక్కువ మొత్తంలో ఇస్తున్నామని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు పేర్కొన్నారు. అధికంగా వసూలు చేస్తున్న పన్నులను తగ్గించాలని బల్దియాను కోరుతున్నారు.