కరోనాకు ముందు సింగరేణిలో బొగ్గు వెలికితీత ఎంత వేగంగా సాగేదో... ఉత్పత్తి అయిన బొగ్గుకు అంతే డిమాండ్ ఉండేది. ఇలా తీసిన వెంటనే అలా రవాణా అయ్యేది. ఖమ్మం జిల్లాలోని సింగరేణి వ్యాప్తంగా రోజుకు లక్షా 80 వేల టన్నుల నుంచి 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అయ్యేది. సింగరేణిలో ఉత్పత్తి అయిన దాదాపు 85 శాతం బొగ్గు... విద్యుత్ ప్లాంట్లకు సరఫరా అవుతుంది. కేటీపీఎస్, వీటీపీఎస్, ఎస్టీపీపీ, కేటీపీపీ, రామగుండం థర్మల్ పవర్ స్టేషన్, వెల్లూర్ థర్మల్ పవర్ స్టేషన్ తదితర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సింగరేణి బొగ్గును సరఫరా చేస్తుంది.
గనుల్లో పేరుకుపోయిన బొగ్గు...
లాక్డౌన్ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలన్నీ కుంటుపడ్డాయి. పరిశ్రమలు మూతపడటం వల్ల అన్ని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఒకటి నుంచి మూడు యూనిట్ల ఉత్పత్తిని నిలిపివేశాయి. ఈ క్రమంలో బొగ్గుకు డిమాండ్ బాగా తగ్గింది. విద్యుత్‌కు డిమాండ్ లేకపోవడం, ఫలితంగా బొగ్గుకు డిమాండ్ తగ్గిపోవటం వల్ల సింగరేణి ఏరియాల్లో బొగ్గు ఎక్కడికక్కడ పేరుకుపోయింది.
కాపాడుకోవటం కూడా భారమే...
విలువైన బొగ్గు సకాలానికి సద్వినియోగపడక పోతుండటం వల్ల సింగరేణి కొంత క్లిష్ట పరిస్థితుల్నేఎదుర్కొంటోంది. నిల్వచేసిన బొగ్గును కాపాడుకోవడం కూడా భారంగానే పరిణమిస్తోంది. బొగ్గును ఎక్కువ కాలం నిల్వచేయటం వల్ల ఉష్ణోత్పత్తి శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా రేటు కూడా తగ్గుతోంది. బొగ్గు గాలిలో కలిసినప్పుడు మండే స్వభావం ఏర్పడుతుంది. అక్కడక్కడా ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగాయి. బొగ్గు కాలిపోకుండ స్ర్పింక్లర్లతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.