CM KCR Announced Compensation for Crop Loss : ఇటీవల కురిసిన వడగళ్ల వానకు పంట నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పర్యటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతులకు భరోసా ఇవ్వడానికి, నష్టం అంచనా వేసేందుకు సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరిన సీఎం.. ముందుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్ మండలంలోని రావినూతల గ్రామానికి చేరుకున్నారు.
అక్కడ నష్టపోయిన పంటలను పరిశీలించారు. మంత్రులు, ఉన్నతాధికారులు, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు సీఎం కేసీఆర్ వెంట ఉన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. 32 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే.. 20 ఎకరాల్లో నష్టం జరిగిందని అన్నదాతలు వివరించారు. ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందించాలని కోరారు.
నష్టపోయిన రైతుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ భరోసానిచ్చారు. కేంద్రం రైతులకు ఎలాంటి సాయం చేయడం లేదని.. అందుకే ఈసారి నివేదిక పంపబోమని సీఎం స్పష్టం చేశారు. రైతులెవరూ నిరాశ చెందవద్దని.. ఎకరానికి రూ.10 వేల పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే దేశంలో రైతులకు ఉపయోగపడే పాలసీలు లేవన్న కేసీఆర్.. దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరమని వ్యాఖ్యానించారు.
"రాష్ట్ర తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ వన్.. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.05 లక్షలు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కేంద్రానికి నివేదిక పంపించదలచుకోలేదు. కేంద్రానికి గతంలో నివేదిక ఇచ్చాం. నయా పైసా ఇవ్వలేదు. నిరసనగా కేంద్రానికి నివేదిక పంపించడం లేదు. రైతులు నిరాశ చెందవద్దు. కౌలు రైతులను ఆదుకునే ఆదేశాలు ఇస్తాం. ఎకరానికి రూ.10 వేలు పరిహారం. దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ అవసరం. దేశంలో రైతులకు ఉపయోగపడే పాలసీలు లేవు. ఇప్పుడున్న కేంద్ర విధానం ప్రకారం రైతులకు ఏమీరాదు. రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం. కొత్త ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేశాం". - సీఎం కేసీఆర్
ఖమ్మం పర్యటన ముగించుకున్న కేసీఆర్ మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర మండలానికి చేరుకున్నారు. ఈ మండలంలోని రెడ్డికుంట తండాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో సీఎం సంభాషించనున్నారు. అక్కడి నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలోని అడవి రంగాపురం గ్రామాన్ని సందర్శిస్తారు.