ముఖ్యమంత్రి కేసీఆర్ నిజస్వరూపం బయటపడుతుందనే భావనతోనే రాష్ట్ర కాంగ్రెస్ నేతలను గోదావరి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లకుండా అడ్డుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. సాగునీరు పేరుతో ప్రాజెక్టులకు భారీగా డబ్బులు కేటాయించి.. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజం నిప్పులాంటిదని.. త్వరలోనే కేసీఆర్ ముసుగు తొలగడం ఖాయమని అన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన లేదని.. డిక్టేటర్ పాలన సాగుతోందని భట్టి దుయ్యబట్టారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులను అడ్డుకోవడానికి వాడుకోవడం దారుణమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లేందుకు భట్టి ప్రయత్నించగా.. వైరా మండల కేంద్రంలోని స్వగృహంలో పోలీసులు ఆయనను గృహ నిర్బంధం చేశారు.