తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR: సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేలా 'నగదు సాయం'పై త్వరలో నిర్ణయం - telangana latest news

కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త. సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేలా నగదు రూపంలో సాయం అందించే విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం ఈ మేరకు స్పందించారు.

CM KCR
CM KCR

By

Published : Jul 21, 2021, 5:02 AM IST

పేదలు సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకునేలా నగదు రూపంలో సాయం అందించే విషయమై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. గతంలో పేదలకు నిర్మించి ఇచ్చిన ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని.. వాటి స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అభ్యర్థించారు.

సానుకూలంగా స్పందించిన సీఎం.. చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి పరిధిలో బాధితులకు ఇళ్ల స్థలాలను సింగరేణి సంస్థ కేటాయించి కలెక్టర్లకు అప్పగించిందని.. వాటిని సత్వరమే పంపిణీ చేయాలని ఎమ్మెల్యేలు కోరారు. దానిపై స్పందించిన ముఖ్యమంత్రి.. దాదాపు 30 వేల మందికి లబ్ధి చేకూర్చే అంశాన్ని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

33 జిల్లాలుగానే భావించాలి..

సింగరేణి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులను ఇక నుంచి ఉమ్మడి జిల్లాకు కాకుండా కొత్త జిల్లాల వారీగానే కేటాయిస్తారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో జిల్లాలు అంటే నోటిఫై చేసిన 33 జిల్లాలుగానే భావించాలని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపెల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలు.. ఆయా జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలకే డీఎంఎఫ్​ టీ నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

సింగరేణి అగ్రగామిగా దూసుకుపోతోంది..

దేశంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి అగ్రగామిగా దూసుకుపోతోందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాక ముందు రూ.12 వేల కోట్లుగా ఉన్న సింగరేణి ఆదాయం.. ఈ ఏడాది దాదాపు రూ.27 వేల కోట్లకు చేరుకోనుందని వివరించారు.

'దళిత బంధు' అర్హులకు చేరేలా కృషి చేయాలి..

దీంతోపాటు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలకు చేరేలా కృషి చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఖరారవుతున్నాయని చెప్పారు. దళిత బంధు పథకం ప్రాధాన్యత, తద్వారా దళితుల జీవితాల్లో జరగబోయే గుణాత్మక మార్పులను వారికి ముఖ్యమంత్రి వివరించారు.

అంతకుముందు సింగరేణి ప్రాంత సమస్యలు, పరిష్కారాలపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం (CM REVIEW) నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు.. పదవీ విరమణ వయసు పెంపుపై కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి వైద్యకళాశాల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు

ABOUT THE AUTHOR

...view details