నిస్వార్థ సేవే ఏకైక లక్ష్యంగా.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న చేతన ఫౌండేషన్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ పరిధిలో దివ్యాంగలకు సహాయకారిగా నిలిచింది. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 120 మంది దివ్యాంగులకు ట్రై సైకిళ్లను అందజేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీపీ విష్ణు వారియర్, చేతన ఫౌండేషన్ వ్యవస్థపకలు వెనిగళ్ల రవికుమార్, రేణుక దంపతులు లబ్ధిదారులకు ట్రై సైకిళ్లను అందించారు.
పూర్వ ఖమ్మం జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గంధంపల్లికి చెందిన వెనిగళ్ల రవి, రేణుక దంపతులకు... సేవా కార్యక్రమాలు చేపట్టడం వారికి అభిరుచి. వెనిగళ్ల రవి ఇంజినీరింగ్ తర్వాత అనేక ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు. 2000 వ సంవత్సరంలో అమెరికా పయనమయ్యారు. ఆరిగాన్ రాష్ట్రం పోర్ట్ ల్యాండ్ సిటీలో ఐటీ ఉద్యోగిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య రేణుక మరో ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పని చేస్తున్నారు. అమెరికా వెళ్లిన తర్వాత సేవా కార్యక్రమాలపై తీవ్రంగా ఆలోచించిన వెనిగళ్ల రవి దంపతులు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడంతోపాటు సేవా భావాన్ని చాటాలన్న లక్ష్యంతో 2016 డిసెంబర్ 24 న చేతన ఫౌండేషన్ పేరిట సేవలు ప్రారంభించారు. నిస్వార్థ సేవే ఏకైక లక్ష్యం నినాదంతో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. జాతి, మత, కుల, భాష, సాంస్కృతిక, రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా కేవలం సమాజ సేవ కోసం ఆవిర్భావించిన చేతన ఫౌండేషన్ అందుకు అనుగుణంగానే సేవా తత్పరతను చాటిచెబుతోంది.