Sitarama Lift Irrigation Project: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త ఆయకట్టు, స్థిరీకరణ, నాగార్జునసాగర్ ఎడమకాలువ కింద కొంత ఆయకట్టుకు నీటి సరఫరా.. ఇలా మొత్తం 6.74 లక్షల ఎకరాలకు నీరందించేందుకు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దుమ్ముగూడెం నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఆయకట్టుకు సరఫరా చేసే ఈ పథకం అంచనా వ్యయం రూ.13,057 కోట్లు. దీనికి కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ, జలసంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు పొందింది.
ఇదే సమయంలో దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజి నిర్మాణాన్ని చేపట్టింది. మొదట సీతారామ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి లభించగా, తర్వాత సీతమ్మసాగర్‌ను కూడా కలిపి దరఖాస్తు చేయమని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే చేయగా.. అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ టీవోఆర్ ఇచ్చి తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. సీతారామ ఎత్తిపోతలకు ఆమోదం తెలిపిన జలసంఘం డైరెక్టరేట్లు.. తమకు కూడా సీతమ్మసాగర్‌తో కలిపి ప్రతిపాదనలు ఇవ్వాలని తాజాగా సూచించాయి.
దీంతో ఇరిగేషన్ ప్లానింగ్, వ్యయం-ప్రయోజనం ఇలా అన్ని అనుమతులు మళ్లీ తీసుకోవాల్సి ఉంటుంది. సీతమ్మసాగర్ బ్యారేజి నిర్మాణ వ్యయం రూ.3600 కోట్లు. ఇక్కడ 280 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఏడు యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. దీని వ్యయ అంచనాను జెన్‌కో తయారు చేస్తోంది. అది సుమారు రూ.600 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. ఇవన్నీ కలిపితే నిర్మాణ వ్యయం ఎక్కువ, ప్రయోజనం తక్కువ అవుతుంది.
దీంతో ఇల్లెందు ప్రాంతంలోని 1.11 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టును సీతారామ ఎత్తిపోతల కిందకు తేవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీని వ్యయం సుమారు రూ.2600 కోట్లని సమాచారం. వీటిని కూడా కలిపితే వ్యయం-ఫలితం నిష్పత్తి 1 : 1.7 ఉంటుంది. పంటలు కూడా గతంలో ప్రతిపాదించినవి కాకుండా కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది. ఇలా అన్నింటిలోనూ సవరణలు చేసి సమర్పించాల్సిన పరిస్థితి. పంపుహౌస్‌ల డిజైన్లు, వీటి ఆమోదానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా జలసంఘం కోరినట్లు తెలిసింది.
పంపుహౌస్‌ల సివిల్ పనుల డిజైన్‌కు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలపగా, ఎలక్ట్రో మెకానికల్ పనులకు జెన్‌కో అనుమతి ఇచ్చింది. కాళేశ్వరం ఎత్తిపోతలలో మొదట ఆమోదం తెలిపిన దాన్ని సవరించి రెండోసారి తగ్గించి ఆమోదం తెలపడం.. పంపుహౌస్‌లు నీట మునగడానికి కారణమైందన్న అభిప్రాయం వ్యక్తమవడంతో వివరాలు కోరిన జలసంఘం, అలాంటిదేమీ లేకుండానే సీతారామ ఎత్తిపోతల వివరాలు కోరడం ప్రాధాన్యం సంతరించుకొంది. సమ్మక్కసాగర్ బ్యారేజికి సంబంధించి కూడా కొన్ని వివరాలు కోరినట్లు తెలిసింది.