Bhatti Vikramarka Padayatra: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో చేపట్టిన పాదయాత్ర పెద్దమండవ గ్రామంలో సాగింది. ఈ పాదయాత్రలో సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరిస్తూ భట్టి విక్రమార్క ముందుకు సాగుతున్నారు. ప్రజాసమస్యలు పరిష్కారం అయ్యేంతవరకూ పీపుల్స్ మార్చ్ కొనసాగుతుందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న తెరాస ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందన్నారు.
తెలంగాణ ప్రజల సొమ్ము ప్రగతి భవన్లో ఉందన్న భట్టి.. దాని గేట్లను బద్దలు కొట్టి ప్రజలకు పంచుతామన్నారు. రైతులు వరి సాగు చేస్తే ఉరి వేస్తామన్న కేసీఆర్కు అన్నదాతలే ఉరి వేసేందుకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు, పింఛన్లు, మహిళలకు రుణాలు రావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భట్టి తెలిపారు.