Bhatti Vikramarka Biography :సాధారణ కార్యకర్త నుంచి సీఎల్పీ నేతగా అంచెలంచెలుగా ఎదిగిన మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్వస్థలం, ఖమ్మం జిల్లాలోని వైరా మండలం స్నానాల లక్ష్మీపురం. 1961 జూన్ 15న జన్మించిన ఆయన కాంగ్రెస్ వారసత్వాన్ని తల్లిదండ్రుల నుంచే పుణికి పుచ్చుకున్నారు. రాజకీయ ప్రస్థానాన్ని హస్తం పార్టీతోనే ప్రారంభించారు. ఎంఏ చదివిన విక్రమార్క 1992 వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పనిచేశారు.
2000 వరకు ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్‌గా ఉన్న భట్టి విక్రమార్క, 2000లో రాజకీయ అరంగేట్రం చేశారు. పీసీసీ సెక్రటరీగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపికైంది మొదలు, ఇప్పటివరకు ఓటమి ఎరుగని నాయకుడిగా సాగుతున్నారు. 2009లో సీపీఐ కంచుకోటగా ఉన్న మధిరలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు భట్టి విక్రమార్క. ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ మధిర నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టగా 2023 లోనూ నాలుగోసారి విజయ దుందుభి మోగించారు.
'పీపుల్స్ మార్చ్' పేరుతో ప్రారంభమైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క యాత్ర
Bhatti Vikramarka Sworn in Minister : కాంగ్రెస్ అధిష్టానం 2015లో భట్టి విక్రమార్కను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించింది. 2018 ప్రతిపక్ష నేతగా భట్టి అసెంబ్లీలో ప్రజా గొంతుకగా ప్రశ్నలు ఎక్కుపెడుతూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. 2014 వరకు శాసన ఉపసభాపతిగా పని చేసిన ఆయనను, 2019 జనవరి 18న తెలంగాణ సీఎల్పీ నేతగా ఏఐసీసీ ప్రకటించింది. 2023లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ప్రజలకు అందుబాటులో ఉన్న విక్రమార్క పీపుల్స్ మార్చ్ (Peoples March) ద్వారా ప్రజలకు తామున్నామని అభయహస్తం ఇవ్వడంలో తనదైన మార్క్ కనబరిచారు.