తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబరాన్నంటిన రఘునందుని పట్టాభిషేక వేడుక - ramayya

ఆదివారం అభిజిత్​ లగ్నాన కౌశల్యాసుతుడు శ్రీరాముడు... సుగుణాల సీతమ్మ పరిణయం వేడుక కన్నుల పండువగా జరిగింది. కల్యాణ వేడుకల్లో భాగంగా ఇవాళ స్వామివారికి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. జానకీరాముల వివాహం జరిపించిన మిథిలా ప్రాంగణమే ఈ క్రతువుకు వేదికైంది.

అయోధ్యాధిపతి పట్టాభిషేక వేడుక

By

Published : Apr 15, 2019, 1:16 PM IST

Updated : Apr 15, 2019, 3:43 PM IST

నిన్న అంగరంగ వైభవంగా సీతామాతను పరిణయ మాడిన నీలిమేఘశ్యాముడు నేడు పట్టాభిషిక్తుడయ్యాడు. వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ వేడుక కనులపండువగా జరిగింది. నవ దంపతుల ఉత్సవ మూర్తులను మేళతాళాలతో పల్లకిలో ఊరేగించి మిథిలా మండపానికి తీసుకొచ్చారు. కోలాటాలు, మంగళ వాద్యాల నడుమ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

పట్టాభిషేక క్రతువులో భాగంగా మొదట విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభించారు. పవిత్ర నదీ జలాలతో అభిషేకించి అష్టోత్తర, సహస్రనామ, సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. అభిజిత్​ లగ్నంలో వెండి సింహాసనంపై స్వామిని పట్టాభిషిక్తున్ని చేశారు.

ఆభరణాల విశిష్టత

త్రేతాయుగంలో అయోధ్యనాథునికి జరిగిన పట్టాభిషేక మూహూర్తానే ఏటా భద్రాద్రిలో క్రతువు నిర్వహించడం పరిపాటి. పట్టాభి రామయ్యకు రామదాసు చేయించిన నగలను స్వామివారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. స్వర్ణచక్రం, రాజదండ, రాజముద్ర, సామ్రాట్​ కిరీటం, సీతమ్మకు, లక్ష్మయ్య ఆభరణాల ప్రాముఖ్యతను వివరిస్తూ అర్చకులు స్వామివారికి అలంకరించారు.

పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్​ దంపతులు

రఘుకుల తిలకుని పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్​ దంపతులు హాజరయ్యారు. ప్రధాన ఆలయం నుంచి మిథిలా మండపానికి స్వామివారిని తీసుకొచ్చిన ఊరేగింపులో పాల్గొన్నారు. జానకీ ప్రాణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించారు.

భారీగా హాజరైన భక్తజనం

పట్టాభిషేక క్రతువుకు భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మిథిలా ప్రాంగణమంతా కిక్కిరిసి పోయింది. రఘునాథుని నామస్మరణతో పరిసరాలన్నీ పులకించిపోయాయి. జై శ్రీరామ, రఘుకుల తిలకా శ్రీరామ చంద్ర అంటూ జయజయధ్వానాలతో మిథిలా ప్రాంగణం హోరెత్తింది.

భారీ భద్రత

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

అంబరాన్నంటిన రఘునందుని పట్టాభిషేక వేడుక


ఇదీ చదవండి: నేడు తెరాస విస్తృత స్థాయి సమావేశం

Last Updated : Apr 15, 2019, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details