తెలంగాణ

telangana

ETV Bharat / state

Godavari Water Level at Badrachalam : శాంతిస్తున్న గోదారమ్మ.. భద్రాచలం వద్ద 54.3 అడుగులకు చేరిన నీటిమట్టం - భద్రాచలం వద్ద కాస్త శాంతిస్తున్న గోదారమ్మ

Badrachalam Floods 2023 : భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి కాస్త తగ్గుముఖం పట్టింది. ఎగువ నుంచి వచ్చే వరద కాస్త తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 54.3 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. వరద ప్రవాహంతో ఏజెన్సీలోని ముంపు ప్రాంతాలన్నీ అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా భయం గుప్పిట చిక్కుకున్న వరద ప్రభావిత గ్రామాల ప్రజలను.. నీటి మట్టం పెరుగుతుండటం మరింత ఆందోళనకు గురి చేసింది. వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టడంతో బాధిత ప్రాంతాలకు కాసింత ఊరటనిస్తోంది.

Godavari Water Level
Godavari Water Level

By

Published : Jul 30, 2023, 7:27 AM IST

Updated : Jul 30, 2023, 10:48 AM IST

భద్రాచలం వద్ద కాస్త శాంతిస్తున్న గోదారమ్మ

Godavari Water Level at Badrachalam : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం కాస్త నెమ్మదిస్తోంది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీగా వరద ప్రవాహం పోటెత్తింది. ఎగువ నుంచి లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహించింది. వరద నీరు అంతకంతకూ పెరుగుతుండటంతో వరద బాధిత ప్రాంతాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. పలు ప్రాంతాల్లో రహదారులపైకి వరదనీరు చేరింది. ఎగువ నుంచి వరద ప్రవాహం కాస్త తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా తగ్గుతుంది. ప్రస్తుతం భద్రాద్రిలో 54.3 అడుగుల వద్ద గోదావరి నీటిమట్టం కొనసాగుతోంది. ఇంకాస్త వరద ప్రవాహం తగ్గితే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు తొలగించనున్నారు. ఉద్ధృతంగా పెరిగి ఉన్న నీటిమట్టంతో భద్రాచలం స్నానం ఘట్టాల ప్రాంతం వరద నీటిలోనే మునిగి ఉంది.

Khammam Floods 2023 : భద్రాచలం ఛత్తీస్‌గఢ్ వెళ్లే రాష్ట్రీయ రహదారి పూర్తిగా వరదగుప్పిట్లో చిక్కుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే మార్గంలో రహదారిపైకి వరద నీరు ప్రవహించగా రాకపోకలు నిలిపివేశారు. భద్రాచలం నుంచి ఏపీలోని విలీన మండలాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మార్గంలో రాయనిపేట, నెల్లిపాక వద్ద రోడ్లపైకి వరద ముంచెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వరదపోటుతో మూడు రాష్ట్రాల మధ్య ప్రజారవాణా, వాణిజ్య రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. వందల సంఖ్యలో లారీలు, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోయాయి.

భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసన పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు ఇబ్బందులు తప్పలేదు.భద్రాచలం పట్టణంలోని కొత్తకాలనీ, సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్పకాలనీలకు చెందిన సుమారు 2 వేల మంది బాధితులను 4 పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల, నన్నపనేని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో మధ్యాహ్నం 2.30 గంటల వరకు భోజనాలు అందించకపోవడంతో వరద బాధితులు ఆందోళనకు దిగారు. రెండు కేంద్రాల్లో ఉన్న బాధితులంతా ప్రధాన రహదారిపైకి వచ్చి రాస్తారోకో చేశారు. దాదాపు అరగంట పాటు ఆందోళన చేశారు. కేంద్రాలకు తరలించిన అధికారులు భోజనాలు అందించడం లేదంటూ ఆందోళనకు దిగారు. రాత్రి సమయంలోనూ అందరికీ భోజనాలు అందడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. తర్వాత భోజనాలు అందించడంతో బాధితులు ఆందోళన విరమించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ప్రత్యేక హెలికాప్టర్‌లో వరద పరిస్థితిని పరిశీలించారు. చర్లలో హెలికాప్టర్ దిగి పునరావాస కేంద్రాలను సందర్శించారు. బాధితులకు అందుతున్న వసతులపై ఆరా తీశారు. అనంతరం భద్రాచలం చేరుకుని వరద తీవ్రత పరిశీలించారు. దాదాపు 12 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపిన ఆయన.. ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించడం వల్ల నష్టం లేకుండా చూశామని పేర్కొన్నారు. వరద రాకుండా చర్యలు చేపట్టడమే ప్రభుత్వం విఫలం చెందిదన్న విమర్శలను మంత్రి పువ్వాడ అజయ్‌ ఖండించారు. నేటి నుంచి కొంతమేర వరద తగ్గుముఖం పట్టింది. అది వరద బాధిత ప్రాంతాల ప్రజలకు ఉపశమనం కలిగిస్తోంది.

ఇవీ చదవండి :

Last Updated : Jul 30, 2023, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details