Anganwadi Workers Protest in Telangana: పలు డిమాండ్లతో అంగన్‌వాడీలు నిరసనలతో హోరెత్తించారు. ఏళ్లుగా పనిచేస్తున్నా.. ప్రభుత్వపరంగా తగిన గుర్తింపు లేదంటూ జిల్లా కలెక్టర్ల ముట్టడికి యత్నించారు. నిజామాబాద్‌లో కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన అంగన్‌వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కనీసవేతనం , బీమా సదుపాయం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ అంగన్‌వాడీలు కలెక్టరేట్‌కు భారీగా తరలివచ్చారు. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అంగన్‌వాడీ(Anganwadi Workers)లంతా ఎస్సై ధనశ్రీని చుట్టుముట్టి ఆమె జుట్టుపట్టి లాగడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది. నాయకులను రెండో పట్టణఠాణాకు తరలించగా.. అంగన్‌వాడీలు స్టేషన్‌ను ముట్టడించేందుకు పరుగులు పెట్టారు. వీధి దుకాణంలో బెల్టును తీసి వారిని నిలువరించేందుకు డీఎస్పీ ఉమేందర్ ప్రయత్నించారు. పోలీసులతో బలప్రయోగం చేసి ఉద్యమం అణిచివేయాలని చూస్తున్నారని ఆక్షేపించారు.
Anganwadi Staff Strike in Mahabubnagar : అంగన్వాడీల సమ్మెబాట.. కేంద్రాల్లో నిలిచిపోయిన సేవలు
Anganwadi Workers Darna in Khammam: ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ధర్నా చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జగిత్యాల కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు భారీగా తరలి వచ్చి నిరసన చేపట్టారు. 11 రోజులుగా సమ్మె చేస్తున్నా.. కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు ధర్నా నిర్వహించారు. కలెక్టర్ బయటికి రావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలోని ఏకశిలా పార్క్ నుంచి వరంగల్ కలెక్టర్ కార్యాలయం(Warangal Collector Office) వరకు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.
"జీతాలు మాకు సరిపోడం లేదు. మా పిల్లలను చదివించాలన్నా ఇబ్బందిగా ఉంది. మా సమస్యలు పరిష్కరించండి. మా రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కోరుతున్నాం. మాకు హెల్త్‌కార్డు ఇప్పించండి. సమ్మెలో మేం చేసిన డిమాండ్స్ అన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం."- అంగన్‌వాడీ ఉద్యోగిని