తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారిని పొట్టన పెట్టుకున్న విద్యుత్​ మంటలు

అర్ధరాత్రి అకస్మాత్తుగా మీ బిడ్డకు బాలేదు వెంటనే రండి అన్న వార్తతో ఆతల్లి మనసు ఏదో కీడు శంకించింది. తన కూతురికి ఏమీ కాలేదనుకుని అమ్మా.. అమ్మా.. అంటూ ఆస్పత్రి అంతా వెతుకుతూ కనిపించిన వారందరినీ బిడ్డజాడ చెప్పమంటూ వేడుకుంది. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న కూతురు మృతదేహాన్ని చూసి ఆ మాతృమూర్తి గుండెలవిసేలా విలపించింది.  ప్రభుత్వ వసతి గృహంలో భద్రంగా ఉందనుకున్న తమ కన్నపేగును విద్యుత్​ మంటలు బూడిద చేశాయంటూ ఎవరినీ నిందించలేక లోలోపలే కుమిలి కుమిలి ఏడ్చింది. ఈ హృదయ విదారకర ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది.

By

Published : Jul 16, 2019, 9:48 AM IST

Updated : Jul 16, 2019, 6:42 PM IST

చిన్నారిని పొట్టన పెట్టుకున్న విద్యుత్​ మంటలు

చిన్నారిని పొట్టన పెట్టుకున్న విద్యుత్​ మంటలు

రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి. బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరు వలసొచ్చారు. తమ ఆశలన్నీ తొమ్మిదేళ్ల కూతురుపైనే పెట్టుకుని బతుకుతున్నారు. అందరి పిల్లల్లాగే తమ బిడ్డను కూడా పెద్ద చదువులు చదివించాలని కలలుగన్నారు. సర్కారు హాస్టల్లో సీటొచ్చిందని సంబరపడిపోయారు. కానీ మాయదారి వసతిగృహం తమ బిడ్డను పొట్టన పెట్టుకుంటుందని ఊహించలేక పోయారు. ఖమ్మం జిల్లాలోని ఓ ప్రభుత్వ వసతిగృహంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన బాలిక తల్లి ఆస్పత్రి ప్రాంగణంలో బిడ్డ కోసం పడిన హృదయ వేదన అందరిచేత కంటతడి పెట్టించింది.

ఆశల సౌధం కూలిపోయింది

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెంకు చెందిన బరపటి సంజీవ, లక్ష్మీ దంపతులు బతుకుదెరువు కోసం కొంతకాలం కిందట ఖమ్మం వలస వచ్చారు. తమ కుమార్తె స్పందనకు ప్రభుత్వ వసతి గృహంలో సీటు రావడం వల్ల అందులో చేర్చారు. చక్కగా చదువుతున్న చిన్నారి విద్యుత్​ ప్రమాదంలో కడతేరిపోతోందని ఊహించలేకపోయారు.

నాబిడ్డే ఎలా...

ఆదివారం రాత్రి వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బాలిక మృతిచెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిగతా విద్యార్థినుల దగ్గరకెళ్లి తన కూతురు ఏదంటూ ఆ తల్లి పడిన రోదన చూపరుల హృదయాల్ని కలిచివేసింది. అప్పటి వరకూ తమతో ఉన్న స్నేహితురాలు దూరమవడం మిగతా చిన్నారులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

విచారణ కమిటీ ఏర్పాటు

ఘటనపై ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు. నలుగురు సభ్యుల కమిటీ నియమించారు. బాధిత కుటుంబానికి రూ. 2 లక్షలు ఎక్స్​గ్రేసియా, కుటుంబంలో ఒకరికి ఔట్​సోర్సింగ్​ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.

ఇదీ చూడండి:2020 నాటికి సున్నా స్థాయికి భూగర్భజలాలు

Last Updated : Jul 16, 2019, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details