హుజూరాబాద్ ఉపఎన్నిక (Huzurabad By Election)ను సవాల్‌గా తీసుకున్న తెరాస (TRS)... అభ్యర్థి ఖరారు కోసం కసరత్తు చేస్తోంది. ఓ వైపు హుజూరాబాద్ అభివృద్ధి, సంక్షేమ పథకాల జల్లు కురిపిస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న అధికార పార్టీ... అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈటల రాజేందర్ (Etela Rajender)... తెరాసను వీడినప్పటి నుంచే నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించింది. మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలందరూ అభ్యర్థి ఖరారు లేకుండానే సభలు, సమావేశాలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.
మంత్రి హరీశ్‌రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెరవెనుక మంత్రాంగంలో నిమగ్నమై ఉన్నారు. సీఎం కేసీఆర్... పార్టీ నేతలకు నిరంతరం దిశానిర్దేశం చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రధానంగా ఓటర్లను ఆకర్షించే వ్యూహంతో గులాబీ పార్టీ కనిపిస్తోంది. ముఖ్యంగా సామాజిక వర్గాల వారీగా మద్దతు కూడబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఎంపిక సవాల్...
హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల వెంట ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న తెరాసకు... అభ్యర్థి ఎంపిక కూడా సవాల్‌గానే మారింది. తెరాసలో ఇన్నాళ్లు ఈటల రాజేందర్‌దే ఏకచ్ఛత్రాధిపత్యంలా సాగింది. అభ్యర్థి ఎంపిక పట్ల అధికార పార్టీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈటల రాజేందర్‌కు ముందు నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉండేవారు. కాబట్టి కాంగ్రెస్ నుంచి చేరిన కౌశిక్‌రెడ్డికి టికెట్ ఇస్తారని ఒక దశలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
అనేక మంది సీనియర్లు ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ... గత ఎన్నికల్లో ఈటలపై పోటీ చేసిన కౌశిక్‌రెడ్డికి అనూహ్యంగా నామినేటెడ్ కోటాలో అవకాశం ఇచ్చారు. మరోవైపు దళిత బంధు పైలట్ ప్రాజెక్టుకు ఎస్సీ వర్గాల నుంచి మంచి మద్దతు లభిస్తుందని గులాబీ పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బండా శ్రీనివాస్‌ను నియమించారు.