Awareness on Normal Deliveries : రాష్ట్రంలో పెరిగిపోతున్న సిజేరియన్లపై సాక్షాత్తూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలివి. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరిగినా... సాధారణ ప్రసవాలు పెద్ద సంఖ్యలో జరగకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మూహుర్తాలు పెట్టి మరీ సిజేరియన్లు చేసుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఇది మారాల్సిందేనని స్పష్టం చేశారు.
"ప్రపంచంలో ఎక్కడా 30 శాతం మించదు పెద్ద ఆపరేషన్లు. కానీ తెలంగాణలో మాత్రం కేవలం జగిత్యాల జిల్లాలోనే 80 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరం. ఇక నుంచి సాధారణ ప్రసవాలకే మహిళలు, వైద్యులు ప్రాముఖ్యత ఇవ్వాలి. మహిళలను ఆ దిశగా ప్రోత్సహించాలి. సాధారణ ప్రసవాలు పెరిగేలా గర్భిణిలకు అవగాహన కల్పించాలి. జగిత్యాలలో సుఖ ప్రసవాలు పెరిగితే.. ఆశా వర్కర్లకు, ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇస్తాం."
- హరీశ్ రావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
మంత్రి హరీశ్‌రావు సూచనలకు అనుగుణంగా...కరీంనగర్ సర్కారు దవాఖానాలో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రసవాల సంఖ్య పెరుగుతున్నా....అదేస్థాయిలో సిజేరియన్లు ఉన్నాయి. దీనిపై కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో పాటు అదనపు కలెక్టర్ గరిమ అగర్వార్ దృష్టి సారించారు. పురోహితులు ముహుర్తాలు నిర్ణయించి ఒత్తిడి చేయటంతోనే సిజేరియన్లు చేస్తున్నామని వైద్యులు చెప్పటంతో... ఇరువురితో సంయుక్త సమావేశం నిర్వహించారు. వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. తొలి కాన్పు సిజేరియన్ జరిగితే విధిగా రెండోసారి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు చేయాల్సిన వ్యాయామాలతో పాటు సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని సూచించారు.
"ఒకసారి సిజేరియన్ చేస్తే.. రెండో కాన్పులోనూ అదే పంథా సాగించాల్సి వస్తుంది. దీనివల్ల వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి. 50 ఏళ్ల క్రితం సిజేరియన్లు లేవు. కానీ ఈ మధ్య కాలంలో అదొక సేఫ్ ప్రాసెస్ అయింది. మొదటి కాన్పులో కాస్త కష్టపడితే.. రెండో కాన్పుకు చాలా సులభమవుతుంది. సాధారణ ప్రసవం జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు."