కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం గ్రామానికి చెందిన సిర్ర శివరాం పదో తరగతి చదువుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మూతపడి.. ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయులు ఆన్లైన్లో పాఠాలు మొదలుపెట్టారు. అయితే.. ఆన్లైన్ పాఠాలు వినాలంటే స్మార్ట్ఫోన్ ఉండాల్సిందే. కానీ.. శివరాంకి స్మార్ట్ఫోన్ లేదు. తండ్రి మల్లయ్య కూలీపనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించే మల్లయ్యకు స్మార్ట్ఫోన్ కొనే ఆర్థిక స్థోమత లేదు. మరి పదో తరగతి చదువుతున్న శివరాం ఆన్లైన్లో టీచర్లు చెప్పే పాఠాలు వినేదెలా?
ఆన్లైన్ పాఠాలు వినేందుకు.. కూలీకెళ్లి స్మార్ట్ఫోన్ కొన్నాడు!
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల పాఠశాలలు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్, టీవీ సౌకర్యం ఉన్నవాళ్లు ఎలాగోలా డిజిటల్ పాఠాలు వింటున్నారు. కానీ.. స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యం లేని విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఓ విద్యార్థి ఆన్లైన్ పాఠాలు వినడం కోసం.. కూలీ పనులకు వెళ్లి డబ్బులు కూడబెట్టుకొని స్మార్ట్ఫోన్ కొనుక్కున్నాడు.
ఆన్లైన్ పాఠాలు వినేందుకు.. కూలీకెళ్లి స్మార్ట్ఫోన్ కొన్నాడు!
శివరాంకి తల్లిదండ్రులను స్మార్ట్ఫోన్ కోసం ఇబ్బంది పెట్టాలనిపించలేదు. అందుకే.. మూడు నెలలు కూలీ పనులకు వెళ్లాడు. ఆ డబ్బులన్నీ కూడబెట్టి రూ.9వేలు పెట్టి స్మార్ట్ఫోన్ కొనుక్కున్నాడు. తన కష్టంతో కొనుక్కున్న స్మార్ట్ఫోన్లో క్రమం తప్పకుండా ఆన్లైన్లో పాఠాలు వింటున్నాడు. స్మార్ట్ఫోన్ కోసం అమ్మానాన్నలు వేధించే ఈ కాలంలో.. తల్లిదండ్రులకు భారం కాకుండా.. కూలీకి వెళ్లి స్మార్ట్ఫోన్ కొనుక్కొని ఆన్లైన్ పాఠాలు వింటున్న శివరాంను అందరూ అభినందిస్తున్నారు.