తెలంగాణ

telangana

ETV Bharat / state

చిట్టి చేతులు... కరాటే విద్యలో అసామాన్యులు - కరాటే శిక్షణ

హూ... హా... అంటూ చిట్టి చేతులు కరాటేలో ప్రతిభ కనబరుస్తున్నాయి. వేసవి సెలవుల్లో చిన్నారులు కాలాన్ని వృథా  చేయకుండా ఉచిత కరాటే శిక్షణలో పాల్గొంటూ మానసిక, శారీరక దృఢత్వాన్ని పొందుతున్నారు. కరీంనగర్​కు చెందిన ఓ న్యాయవాది ఇస్తోన్న ఉచిత కరాటే శిక్షణలో చిన్నారులు ఔరా అనిపిస్తూ...పతకాలను సాధిస్తున్నారు.

ఉచిత కరాటే శిక్షణ

By

Published : May 7, 2019, 3:35 PM IST

వేసవి సెలవులు వచ్చాయంటే చిన్నారులు అమ్మమ్మ, తాతయ్య ఇంటికి వెళ్లి ఆటపాటల్లో మునిగి తేలుతారు. ఇది ఒకప్పటి మాట. ఇప్పటి రోజుల్లో కాలాన్ని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకునే దిశగా వారి అడుగులు పడుతున్నాయి. కరాటే లాంటి విద్యల్లో శిక్షణ తీసుకుంటూ శారీరక, మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. కరీంనగర్​ జిల్లాకు చెందిన ఓ న్యాయవాది ఇస్తోన్న ఉచిత కరాటే శిక్షణకు ఆసక్తి చూపుతున్నారు. తమ పిల్లల్లో ఉన్న ఉత్సాహాన్ని రెట్టింపు చేసేలా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తున్నారు.

కరాటేలో ప్రతిభ కనబరుస్తోన్న చిన్నారులు

ఉచిత శిక్షణ

కరీంనగర్​కు చెందిన గౌరు రాజురెడ్డి వృత్తి పరంగా న్యాయవాది అయినా... జిల్లా కరాటే అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. చిన్నతనంలో నేర్చుకున్న కరాటే విద్యను చిన్నారులకు ఉచితంగా నేర్పిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ఓ వైపు వృత్తి ధర్మాన్ని నెరవేరుస్తూనే... పిల్లలకు శిక్షణనివ్వడం గమనార్హం. ఐదు సంవత్సరాల నుంచి ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఉదయం 6 నుంచి 8 వరకు, సాయంత్రం 6 నుంచి 7 వరకు శిక్షణనిస్తున్నారు.

సద్వినియోగం చేసుకోవాలి

ఏకాగ్రతతో పాటు క్రమశిక్షణతో నేర్చుకున్న ఏ విద్య అయినా జీవితాంతం అలాగే ఉంటుందని శిక్షకుడు రాజురెడ్డి తెలిపారు. గత ఐదేళ్లుగా శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన చిన్నారులు జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం గర్వకారణమన్నారు.

ఆనందంగా ఉంది

కరాటే శిక్షణ తీసుకోవడం తమకు చాలా ఆనందంగా ఉందని చిన్నారులు చెబుతున్నారు. ఏకాగ్రత, మానసిక ఉల్లాసం కలుగుతున్నాయని అంటున్నారు. ఈ శిక్షణ వల్ల పతకాలు సాధిస్తున్నామని తెలిపారు.

చిన్నారుల్లో దృఢత్వం

ఇలాంటి శిక్షణా కార్యక్రమాల వల్ల తమ పిల్లల్లో శారీరక దృఢత్వం పెరుగుతోందని తల్లిదండ్రులు అంటున్నారు. ఉచితంగా కరాటే నేర్పిస్తున్న శిక్షకుడు రాజురెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారులను ఆటలకు మాత్రమే పరిమితం చేయకుండా ఇలాంటి యుద్ధ విద్యలు నేర్పించడం ఆదర్శనీయం.

ఇదీ చూడండి : 80ఏళ్లయినా కుర్రాడే... బరిలోకి దిగితే అంతే

ABOUT THE AUTHOR

...view details